తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఆయన నిలబడ్డారు. గజ్వేల్‌లో ఓటమి సంకేతాలు రావడంతో ఆయన కామారెడ్డిని కూడా ఎంచుకున్నారు. అయితే, చిత్రంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోయిన ఆయన.. గజ్వేల్ నుంచే వరుసగా విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణం చేయాల్సి ఉంది.
కానీ, ఇంతలోనే తన ఇంట్లో ఆయన జారి పడడంతోతుంటి ఎముక విరిగింది. దీంతో చికిత్స కూడా చేశారు. ఈ కారణంగా అప్పటి నుంచి కేసీఆర్ ఆసుపత్రికి, ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవల మాత్రమే కొద్దికొద్ది అడుగులు వేస్తూ.. ఇంట్లోనేనడస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. తాజాగా తన పార్టీ పార్లమెంటరీ సభ్యులతో కూడా భేటీ అయ్యారు. ఇక, కేసీఆర్ అనారోగ్యం పాలవడంతో ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. నిబంధనల ప్రకారం .. మూడు మాసాల్లోగా ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయన ప్రమాణం చేయనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేయనున్నట్టు పార్టీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రమాణం చేయకపోతే.. ఎమ్మెల్యేగా ఆయనకు ఎలాంటి జీత భత్యాలు అందవు. అదేవిధంగా సైన్ పవర్ కానీ, అధికారిక ఆదేశాలు ఇచ్చేందుకు కానీ.. అవకాశం లేదు. ప్రస్తుతం కేసీఆర్ ప్రమాణం చేయనందున.. ఆయనకు ఇవేవీ లేకుండా పోయాయి. ఇక, ఇదేసమయంలో సభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనను ఎన్నుకోనున్నారు.