వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకుందా? పార్టీ అనుసరిస్తున్న విధానంపై నాయకులు తర్జన భర్జన పడు తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు టికెట్ల వ్యవహారంలో నరాలు తెగే ఉత్కంఠను చవిచూసిన నాయకులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. కొందరికిటికెట్ దక్కక పోయినా.. సర్దుకుపోయే ధోరణికి వచ్చేశారు. మరికొందరు మాత్రం పక్క చూపులు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికే సమన్వయ కర్తలుగా నియమితులైన వారు.. ఇప్పుడు కొత్త టెన్షన్‌ను ఎదుర్కొంటు న్నారని తెలుస్తోంది.
“సమన్వయ కర్తలుగా ప్రకటించారే తప్ప.. వారికే బీ ఫాం ఇస్తామనికానీ, వారినే అభ్యర్థులని కానీ పార్టీ నిర్ణయించలేదు. ఇది కేవలం ఒక పిక్చర్ మాత్రమే. ఇదే ఫైనల్ కాకపోవచ్చు” అని కీలక సలహాదారు ఒకరు.. ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే..ఈ వ్యాఖ్యలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే.. ఇటీవల సమన్వయ కర్తలుగా నియమితులైన వారిలో మార్పులు , చేర్పులకు పార్టీ అదిష్టానం పరిశీలన చేస్తోంది. అంటే.. సమన్వయ కర్తలుగా నియమించినా.. బీ-ఫాం ఇచ్చే వరకు వీరి టెన్షన్ ఉండనుంది.
ఉదాహరణకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టి ఆయన సూచించిన మరో నాయకుడు.. వెంకటేశ్‌ను సమన్వయ కర్తగా నియమించారు. ఈయనను సాక్షాత్తూ చెన్నకేశవరెడ్డే సూచించారు. అయితే.. రోజులు గడిచే సరికి.. ఈయన సరిపోడని భావించి.. ఇప్పుడు మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఇక్కడ దింపాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రచారానికి శ్రీకారం చుట్టుకున్న వెంకటేశ్.. ఇప్పుడు పక్కకు తప్పుకొనే పరిస్థితి వచ్చింది.
ఇక, గుంటూరు వెస్ట్‌కు సమన్వయకర్తగా నియమితులైన.. మంత్రి విడదల రజనీకి కూడా.. ఇదే తరహా పరిస్థితి ఎదురు కానుందని అంటున్నారు. ఆమెను నరసరావుపేట ఎంపీ సీటుకు బీసీ కోటాలో పంపించ నున్నారని.. తెలుస్తోంది. దీంతో ఆమె కూడా.. నియోజకవర్గంలో ధూంధూంగా పెట్టుకున్న పర్యటనను ఆపేసుకుని.. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ సమన్వయ కర్తగా నియమితులైన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను కూడా తప్పించనున్నారని తెలుస్తోంది.
సెంట్రల్‌లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమాకు దీటైన అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టి.. ఆయనను తిరిగి పశ్చిమ నియోజకవర్గానికి పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వెల్లంపల్లి కూడా.. తర్జన భర్జనలో పడ్డారు. మొత్తంగా.. సమన్వయ కర్తలను నియమించినా.. వారికి కూడా బీఫాం వచ్చే వరకు నమ్మకం లేకుండా పోవడంతో నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates