జ‌న‌సేన-టీడీపీల మ‌ధ్య చిచ్చే టార్గెట్‌.. ఇది ఎవ‌రి కుట్ర‌?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసేందుకు రెడీ అయిన.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన‌లు ఇప్ప‌టికే ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించి ముందుకు సాగుతున్నాయి.ఈ క్ర‌మంలోనే యువ‌గ‌ళం ముగింపు స‌భ‌లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు ఉమ్మ‌డిగా పాల్గొన్నారు. ఇక‌, రా..క‌ద‌లిరా! స‌భ‌ల్లోనూ క‌లిసి పాల్గొనేలా ప్లాన్ చే్స్తున్నారు. ప‌ర‌స్ప‌రం ముందుకు దూసుకుపోతున్నారు. ఒకరి ఇంటికి ఒక‌రు వెళ్లి మ‌రీ వ్యూహ ప్ర‌తివ్యూహాలు రెడీ చేసుకుంటున్నారు. కొంత క్షేత్ర‌స్థాయిలో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను కూడా అధిగ‌మిస్తున్నారు.

మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేసేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను కూడా జ‌న‌సేన‌, టీడ‌పీలు అన్వేషించి.. వాటిని అంది పుచ్చుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో కొంత స‌మ‌స్య‌ల‌కు దారి తీసే.. సీట్ల షేరింగ్ విష‌యంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. టీడీపీలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జ‌న‌సేన‌లోనూ టికెట్లు ఆశిస్తున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి, అనంత‌పురం, గుంటూరు జిల్లాలు స‌హా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ల్లో జ‌నసేన నాయ‌కులు టికెట్లు ఆశిస్తున్నారు. ఇక‌, ఇవే టికెట్ల‌ను టీడీపీ నేత‌లు కూడా ఆశిస్తున్నారు. దీంతో టికెట్ల విష‌యం ఒక‌ర‌కంగా కొంత వ‌ర‌కు ఇబ్బందిగానే ఉంది.

దీంతో టికెట్ల విష‌యంపై టీడీపీ, జ‌న‌సేన‌లు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అయితే.. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన ఓ రాజ‌కీయ వ‌ర్గం.. దీనిని టార్గెట్ చేస్తూ.. టీడీపీ-జ‌న‌సేన కేడ‌ర్‌లో గంద‌ర‌గోళం సృష్టించి.. పార్టీ పొత్తును విచ్ఛిన్నం చేసేలా వ్యూహాత్మ‌కంగా ఒక పెద్ద ప్ర‌క‌ట‌నను టీడీపీ పేరుతోనే విడుద‌ల చేయ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. సోష‌ల్ మీడియాలో అనూహ్యంగా వ‌చ్చిన ఈ న‌కిలీ ప్ర‌క‌ట‌న‌లో టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు చెప్పిన‌ట్టుగా పెద్ద క‌థ‌న‌మే రాసుకొచ్చారు. “రాష్ట్రంలో జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసి పోటీ చేస్తున్నాయని.. ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన పుంజుకుంద‌ని.. కాబ‌ట్టి.. సీట్ల షేరింగ్‌లో కొంత పెద్ద మొత్తం ఆ పార్టీకి కేటాయిస్తున్నా”మ‌ని అందులో పేర్కొన్నారు.

అంతేకాదు.. మొత్తం 175 సీట్ల‌లో 112 సీట్ల‌లో టీడీపీ పోటీ చేస్తుంద‌ని.. మిగిలిన 63 స్థానాల‌ను జ‌న‌సేన‌కు పంచుతున్నామ‌ని అచ్చెన్నాయుడు పేర్కొన్న‌ట్టుగా ఆ లేఖ‌లో ఉంది. ఇది సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. దీంతో స‌హజంగా ఎక్కువ మొత్తంలో ఆశావ‌హులు ఉన్న టీడీపీలో చిచ్చురేగి.. జ‌న‌సేన‌తో క్షేత్ర‌స్థాయిలో క‌య్యం పెట్టుకుని విచ్ఛిన్నం దిశ‌గా ముందుకు సాగే ప్ర‌మాదం ఉంది. ఇదే స‌ద‌రు.. రాజ‌కీయ వ‌ర్గానికి కూడా కావాల్సింది. పైగా.. ఈ ప్ర‌క‌ట‌న‌లో అచ్చెన్నాయుడు సంత‌కాన్ని డిటో దింపేశారు. దీంతో తొలుత ఓ అర‌గంట వ‌ర‌కు ఈ ప్ర‌క‌ట‌న‌ను అంద‌రూ నిజ‌మ‌నే అనుకున్నారు. కానీ.. టీడీపీ రంగంలోకి దిగి దీనిని న‌కిలీ ప్ర‌క‌ట‌న‌గా తేల్చి చెప్పింది. ఇదీ.. సంగ‌తి!!