కాంగ్రెస్సా.. టీడీపీనా.. మంత్రి ప‌క్క‌చూపులు..!

వైసీపీలో కొంద‌రు నాయ‌కుల ప‌రిస్థితి భిన్నంగా ఉంది. టికెట్ ద‌క్క‌లేద‌ని.. చాలా మంది నాయ‌కులు వ‌గరుస్తుండ‌గా.. టికెట్ ద‌క్కించుకున్న నాయ‌కుల ప‌రిస్తితి మ‌రోలా ఉంది. త‌మ‌కు ఈ సీటు వ‌ద్దు.. వేరే సీటు కావాల‌ని నాయ‌కులు మంకు ప‌ట్టుప‌డుతున్నారు. అయితే.. వైసీపీ అధిష్టానం మాత్రం.. అన్నీ ఆలోచించే నీకు సీటు ఎలాట్ చేశామ‌ని, దీనిలో ఎలాంటి మార్పూ లేద‌ని తేల్చేస్తోంది. దీంతో ఇప్ప‌టికే ఇంచార్జు లుగా నియ‌మితులైన‌ప్ప‌టికీ.. అసంతృప్తితో ఉన్న‌వారు ప‌క్క చూపులు చూస్తున్నారు.

ఇలాంటివారిలో వైసీపీ కీల‌క నేత‌, బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఒక‌రు. ఈయ‌న ఆలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ ప‌రిస్థితి బాగోలేద‌ని చెబుతూ.. ఆయ‌న‌ను క‌ర్నూలు పార్ల‌మెంటు స్థానానికి వైసీపీ పంపించింది. ఇదే.. ఇప్పుడు గుమ్మ‌నూరుకు గుబులు రేపుతోంది. ఎమ్మెల్యేగా ప‌నికిరాన‌ని తేల్చేసిన వైసీపీ ఎంపీ సీటులో ఇంచార్జ్‌గా నియ‌మించ‌డం ఏంట‌ని ఆయ‌న చింతిస్తున్నారు.

ఈ క్ర‌మంలో త‌న‌ను కాద‌ని వేరే వారికి సీటు ఇచ్చేందుకు.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా త‌న‌ను క‌ర్నూలుకు పంపించింద‌ని గుమ్మ‌నూరు అనుమానిస్తున్నారు. దీంతో ఆయ‌న తెర‌చాటున త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తున్నారు. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయిన ఆయ‌న‌.. ఎంపీ టికెట్ జేబులోనే ఉంద‌ని.. మీ నిర్ణ‌యం ఏంటోచెబితే దాని ప్ర‌కారం నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు అంతేకాదు.. ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉంద‌ని కూడా చెప్పారు.

ఇప్పుడు వారం రోజుల‌కు పైగానే గుమ్మ‌నూరు హైద‌రాబాద్‌లో తిష్ఠ వేశారు. ఆయ‌న చూపు ప్ర‌ధానంగా టీడీపీపైనే ఉంద‌ని తెలుస్తోంది. మ‌రోసారి ఆలూరు నుంచి విజ‌యం ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న గుమ్మ‌నూరు.. టీడీపీ నుంచిఈ టికెట్ ఆశిస్తున్నారు. ఒక‌వేళ ఈ టికెట్‌ కుద‌ర‌క‌పోతే.. వేరేదైనా ఇవ్వాల‌ని అంటున్నారు. కానీ, గ‌తంలో మాజీ మంత్రి అయ్య‌న్న‌తో ఉన్న వివాదం నేప‌థ్యంలో టీడీపీ ఆచి తూచి అడుగులు వేస్తున్న‌ట్టు సమాచారం. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన గుమ్మ‌నూరు. అయితే.. టీడీపీ లేకుంటే కాంగ్రెస్ అన్న‌ట్టుగా మ‌రోవైపు హ‌స్తం నేత‌ల‌తోనూ ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని నియోజ‌క‌వ‌ర్గం టాక్‌. మ‌రి చివ‌ర‌కు ఎటు వెళ్తారో చూడాలి.