ఏప్రిల్ 16నే సార్వ‌త్రిక స‌మ‌ర‌మా? క్లూ దొరికింది?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఎప్పుడు జ‌ర‌గ‌నున్నాయి? మార్చిలోనా? ఏప్రిల్‌లోనా? అనే చ‌ర్చ రాజ‌కీయ పార్టీల మ‌ధ్యే కాకుండా.. సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ జోరుగా సాగుతోంది. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్టత లేదు. అయితే.. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్‌.. ఏప్రిల్ 16న సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని(తాత్కాలి డేట్‌) వెల్ల‌డిస్తూ.. అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు ఏప్రిల్ 16నే సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

2019లోనూ ఏప్రిల్ 20వ తేదీన ఎన్నిక‌లు జ‌రిగాయి. భార‌త పార్ల‌మెంటులోని 543 లోక్‌స‌భ స్థానాల‌కు రెండు ద‌ఫాలుగా అప్ప‌ట్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. స‌మ‌స్యాత్మ‌క రాష్ట్రాల‌లో రెండు సార్లు.. ఈశాన్య రాష్ట్రాలు స‌హా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే ద‌ఫా ఎన్నిక‌లు నిర్వ‌హించారు. మొత్తంగా ఏప్రిల్ 20తోనే ఈ క్ర‌తువు ముగిసింది. త‌ర్వాత ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఇప్పుడు కూడా ఇదే తారీఖులో నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. ఢిల్లీ ఎన్నిక‌ల సంఘం అధికారులు.. అన్ని రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

ఏప్రిల్ 16న పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో దీనికి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవాల‌ని.. ఎన్నిక‌ల అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌ని.. వారి వివ‌రాల‌నుత మ‌కు అందించాలని సూచించింది. అదేవిధంగా మౌలిక స‌దుపాయాలు.. పోలింగ్ బూత్‌ల భ‌ద్ర‌త‌, పోలీసులు, పారామిలిట‌రీ సిబ్బంది.. ఇలా, ఎన్నిక‌ల‌కు సంబంధించిన అవ‌స‌రాల‌పై త‌క్ష‌ణ‌మే దృష్టి పెట్టాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం సూచించింది. దీంతో ఏప్రిల్ 16 న లేదా ఒక‌టి రెండు రోజుల్లో ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతున్న‌ట్టుగానే దేశ‌వ్యాప్తంగా వార్త‌లు వస్తున్నాయి.

ఇదిలావుంటే.. పార్టీలు కూడా.. సార్వ‌త్రిక స‌మ‌రానికి సిద్ధ‌మైపోయాయి. మాన‌సికంగానే కాకుండా.. అభ్య‌ర్థుల ప‌రంగా కూడా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు.. ప్రాంతీయ పార్టీలు కూడా రెడీగా నే ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న అంశాలు మిన‌హా.. అన్ని పార్టీలు నోటిఫికేష‌న్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టుగానే దేశంలో రాజ‌కీయ ప‌రిస్థితి మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 16 అంటూ కేంద్ర ఎన్నిల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్త‌ర్వులు.. ఎన్నిక‌ల తేదీకి బ‌లం చేకూరుస్తున్నాయి.