దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు సినీ నటుడిగానే కాకుండా..రాజకీయ నాయకుడిగా కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే. బీజేపీ తరఫున ఎంపీగా కూడా రెబల్ స్టార్ పనిచేశారు. దీంతో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన భార్య శ్యామలాదేవి కొనసాగిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున 2024 ఎన్నికలలో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి శ్యామలా దేవీ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ అరంగేట్రంపై శ్యామలాదేవి కీలక ప్రకటన చేశారు.
కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ నిర్వహణను దగ్గరుండి చూసుకున్న శ్యామలాదేవి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాను కృష్ణంరాజు జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ లపై ఫోకస్ చేశానని, అవి విజయవంతంగా పూర్తయ్యాక రాజకీయాలపై స్పందిస్తానని అన్నారు. నర్సాపురం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృష్ణంరాజు ఎంతగానో పాటుపడ్డారని, పేదలకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాల కోసం తనవంతు కృషి చేశారని వెల్లడించారు.ప్రస్తుతం సేవా కార్యక్రమాలపైనే తన దృష్టి మొత్తం కేంద్రీకరించానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates