మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేసిన.. కీలక పథకానికి ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం మహిళలను ఆకట్టుకునేందుకు.. ‘బతుకమ్మ చీరలు’ పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన వారిని ఎంపిక చేసి.. ఇంటికో చీర చొప్పున పంపిణీ చేసింది. ఇది కూడా కొన్ని చోట్ల వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే.
మొత్తంగా ఈ పథకం కారణంగా.. ఇటు రాజకీయంగాను, అటు పారిశ్రామికంగా చేనేత కార్మికులకు మేలు చేయాలని కేసీఆర్ తలపోశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నుంచి కోట్ల సంఖ్యలో చీరలు కొనుగోలు చేసి.. మహిళలకు పంపిణీ చేశారు. ప్రతి ఏటా తెలంగాణ సమాజం ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ సంబరాల్లో ఈ చీరలను పంచారు. స్వయంగా కేసీఆర్ తనయ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఈ పంపిణీలో పాల్గొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే.. అప్పట్లో ఇలా బతుకమ్మ చీరలను గుండుగుత్తగా కొనుగోలు చేసినప్పటికీ.. కంపెనీలకు కేసీఆర్ బిల్లులు చెల్లించలేదు. ఏకంగా ఈ బిల్లు రూ.220 కోట్ల 32 లక్షలపైనే ఉందని లెక్కతేలింది. పలు దఫాలుగా కంపెనీ నుంచి బిల్లుల కోసం వత్తిడి వచ్చినా.. అప్పటి ప్రభుత్వం సర్ది చెబుతూ వచ్చింది. ఇంతలోనే గత ఏడాది ఎన్నికలు రావడం.. ఆ వెంటనే బీఆర్ ఎస్ అధికారం కోల్పోవడం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఈ బిల్లుల చెల్లింపు బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై పడింది.
ఇదే విషయంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందని, బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.220 కోట్ల బకాయిలను చెల్లించలేదని, అవి చెల్లించకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన తెలిపారు. అంతేకాదు.. బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించి కార్మికులను ఆదుకోవాలని.. సీఎం రేవంత్‌కు ఆయన విన్నవించారు. దీంతో కేసీఆర్ సర్కారు పథకం తాలూకు బకాయిలను రేవంత్ చెల్లించాల్సి వస్తోంది. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.