కులం కుంప‌టి ఎఫెక్ట్‌… వైసీపీలో సెగ‌లు…!


ఉమ్మ‌డి గుంటూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మేక‌తోటి సుచ‌రిత‌.. హోం మంత్రిగా కూడా చేశారు. రెండో ద‌ఫా ఆమెను మంత్రి వ‌ర్గంనుంచి త‌ప్పించారు. ఆది నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాల సామాజిక వ‌ర్గం సుచ‌రిత వెంటే న‌డిచారు. అయితే.. ఇప్పుడు ఆమెను ఇక్క‌డ నుంచి త‌ప్పించి తాడికొండ‌కు మార్చారు.

ఈక్ర‌మంలోనే మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌ల‌సాని కిర‌ణ్‌కుమార్‌కు పార్టీ ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వర్గం ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఇంత‌వ‌ర‌కు బాగానేఉన్నా.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై మాల సామాజిక వ‌ర్గం నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌ల‌సాని.. గ‌తంలో మాదిగ రిజ‌ర్వేష‌న్ కోసం పోరాటం చేసి.. త‌మ హ‌క్కులు కాల‌రాయాల‌ని చూశార‌ని.. పాత సంగ‌తులు తెర‌మీదికి తెస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో ఇటీవ‌ల చోటు చేసుకున్న రెండు ప‌రిణామాల్లో మాదిగ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన బ‌ల‌సాని.. మాల సామాజిక వ‌ర్గంనాయ‌కులు చ‌నిపోతే.. క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని.. త‌మ గ్రామాల‌ను కూడా ఆయ‌న వ‌దిలేశార‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 45 వేల సంఖ్య‌లో ఉన్న మాల ఓట‌ర్ల‌ను ఆయ‌న చిన్న‌చూపు చూస్తున్నార‌ని.. ఈ వ‌ర్గం నాయ‌కులు ఖ‌స్సు మంటున్నారు. ఇటీవ‌ల గుంటూరులో నిర్వ‌హించిన ప్ర‌త్తిపాడు.. మాల సామాజిక వేదిక స‌మావేశంలో నాయ‌కులు బ‌ల‌సాని వ్య‌వ‌హార శైలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌సానికి మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంపై వారు సుదీర్ఘంగా చ‌ర్చించారు. 27 వేల ఓట్లున్న మాదిగ సామాజిక వ‌ర్గానికి టికెట్ ఇవ్వ‌డం స‌రికాద‌ని.. 45 వేల పైచిలుకు ఉన్న మాల సామాజిక వ‌ర్గానికే టికెట్ ఇచ్చేలా పార్టీపై ఒత్తిడి పెంచాల‌ని కొంద‌రు నాయ‌కులు సూచించారు. ఈ విష‌యంపై పార్టీ అధిష్టానాన్ని క‌లుసుకుని త‌మ డిమాండ్ వినిపించాల‌ని లేక‌పోతే.. బ‌ల‌సానికి దూరంగా ఉండాల‌ని కూడా నిర్ణ‌యించ‌డం.. ప్ర‌త్తిపాడు రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రి దీనిపై వైసీపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.