వైసీపీలో కొత్త స్వరం వినిపించింది. ఇప్పటి వరకు సీఎం జగన్ కోసం.. ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేయడం కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పుకొన్న నాయకులు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా స్వరం మారుస్తున్నారు. సీఎం కాదు.. మమ్మల్ని చూసి గెలిపించండి అంటూ.. పిలుపునిస్తున్నారు. కొన్నాళ్ల కిందట.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇదే మాట వినిపించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వైసీపీలో మంటలు రేపాయి. దీనిపై ఆయన అధిష్టానానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు.
అయితే.. ఆ విషయం మరుగున పడిందిలే అనుకునేలోగా.. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే, వైశ్య సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఇదే దారి పట్టారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “వచ్చే ఎన్నికల్లో నన్ను చూసి గెలిపించండి. సీఎంను కాదు. జగన్ ఫొటోను చూసి కాదు. నన్ను, నా పనితీరును చూసి గెలిపించండి” అని కోలగట్ల ప్రకటించారు.
విజయనగరం నియోజకవర్గంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులతో తాజాగా ఆదివారం ఆయన రహస్యంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ.. “మీకు ప్రభుత్వంపై పీకల వరకు కోపం ఉంది. ఆ విషయం నాకు తెలుసు. మీ డిమాండ్లు పరిష్కారం కాలేదు. మీరు సీఎం జగన్‌పై కోపంతో ఉన్నారు. అలాగని నాకు వ్యతిరేకం కావొద్దు. నేను మీ వాణ్ని. ఏ పార్టీలో ఉన్నా.. మీ కోసం పనిచేస్తున్నాను. గతంలోనూ మీకు మేలు చేశాను. సో.. నన్ను చూసి ఓటేయండి. సీఎం జగన్‌ను కాదు” అని ఆయన చెప్పుకొచ్చారు.
మరి ఈ వ్యాఖ్యలు ఏ మేరకు వీరభద్రస్వామికి మేలు చేస్తాయో చూడాలి. అయితే.. మరోవైపు వైసీపీ మాత్రం సీఎం జగన్‌ను చూపించే ఎన్నికలకు వెళ్లాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఒకరిద్దరు(ఇప్పటికి) మాత్రం తమ ను చూసి ఓటేయాలని కోరుతుండడం గమనార్హం
Gulte Telugu Telugu Political and Movie News Updates