విజయవాడ ఎంపీ.. కేశినేని నాని కుమార్తె, విజయవాడలోని 11వ వార్డు కార్పొరేటర్ కేశినేని శ్వేత.. తాజాగా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఇది ఆమోదం పొందిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతోమాట్లాడుతూ.. టీడీపీ తమను అవమానించిందని అన్నారు. పార్టీ టికెట్ ఇచ్చినందుకు మాత్రమే తాము టీడీపీకి ధన్యవాదాలు చెబుతున్నామన్న ఆమె.. ఎంపీగా తన తండ్రిని నారా లోకేష్ తీవ్రంగా అవమానించారని వ్యాఖ్యానించారు.
“తిరువూరులో జరిగిన ఘర్షణ విషయంలో నారా లోకేష్ మాట్లాడారు. తిరువూరుతో నీకేం పని అని మా నాన్నను ఆయన ప్రశ్నించారు. నిజానికి తిరువూరు.. మానాన్న పార్లమెంటు పరిధిలో ఉంది. ఆయనకు సంబంధం ఉండదా? ఈ చిన్న విషయం మేం చెప్పాలా? ఇంతకన్నా అవమానం ఏముంటుంది?” అని శ్వేత అన్నారు. ఇక, తమను పార్టీనే వద్దనుకున్నాక.. తాము మాత్రం టీడీపీలో ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు.
తమతోపాటు ఎవరు వచ్చినా తీసుకువెళ్లేందుకు సిద్ధమేనని కేశినేని శ్వేత తెలిపారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనను విజయవాడకు చెందిన ముగ్గురు టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి కేశినేని నాని ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. తిరువూరులో అసలు ఏం జరిగిందో తెలుసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.