వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్నారైలకు పెద్దపీట వేయనుందా? మెజారిటీ స్థానాల్లో ఎన్నారై టీడీపీ నాయకు లకు సీట్లు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారా? అంటే.. ఔననే చర్చే తెరమీదికి వచ్చింది. ఇప్పటికే కీలకమైన గుడివాడ నియోజకవర్గం టికెట్‌ను ఎన్నారై నాయకుడు వెనిగళ్ల రాముకు చంద్రబా బు కేటాయించారు. దీంతో రాము ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మినీ మేనిఫెస్టోను తీసుకుని ప్రజనలు కూడా కలుస్తున్నారు.
ఇక, ఒక్క గుడివాడే కాకుండా.. పలు నియోజకవర్గాల్లో కూడా ఎన్నారైలకు చంద్రబాబు టికెట్లు ఖరారు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వీటిలో ప్రధానంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఇక్కడ నుంచి ఎన్‌ఆర్‌ఐ కొంప కృష్ణకు టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక, ఇదే జిల్లా నెల్లిమర్లలోనూ మార్పులు తథ్యమని తెలుస్తోంది. కొన్నాళ్లుగా పార్టీలో పెద్దగా దూకుడు చూపించని మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈయన స్థానంలో ఎన్నారై నేత బంగార్రాజుకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి కూడా ఈ దఫా ఎన్‌ఆర్‌ఐ గోనెల విజయచంద్ర పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి 8 నుంచి 10 స్థానాల్లో ఎన్నారైలకు ఈ దఫా టికెట్లు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేసమయంలో 4 నుంచి 6 పార్లమెంటుస్థానాలను కూడా ఎన్నారైలకు కేటాయించనున్నట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
ఇవీ.. కారణాలు
ఉన్నపళంగా టీడీపీలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నారైలకు టికెట్లు ఇవ్వడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయని పార్టీలో చర్చసాగుతోంది. ప్రధానంగా వైసీపీ నేతల ఆర్థిక పోటీని తట్టుకుని నిలబడడం ఒకటైతే.. నియోజకవర్గంలో పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో స్థానిక నాయకులు విఫలం కావడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎన్నారై పార్టీ నాయకులు గత ఐదేళ్లుగా యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో వారిని సంతృప్తి పరచాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా ఉందని తెలుస్తోంది.