జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా వైసీపీ అధినేత, సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. త్యాగాల త్యాగరాజు.. అంటూ పవన్‌కు కొత్త పేరు పెట్టారు. “ఎక్కడ సీటిచ్చినా.. ఓకే అంటారు. అసలు ఇవ్వక పోయినా.. ఓకే అంటారు. పొరుగు పార్టీ అధికారంలోకి వస్తే అదే వంద కోట్లు అన్నట్టుగా ఫీలవుతారు. పార్టీని బలోపేతం చేయకపోయినా.. పక్క పార్టీ నేత సీఎం అయితే.. అదే చాలంటారు. ఆయన త్యాగాల త్యాగరాజు” అని పవన్‌పై విమర్శలు గుప్పించారు.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం.. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన మిత్రపక్షంపై నిప్పులు చెరిగారు. వంచన-మోసాలనే వీరు నమ్ముకున్నారని, చేసింది చెప్పుకొని ఓటు అడిగే పరిస్థితి ఈ పార్టీలకు లేదని జగన్ అన్నారు. నాలుగేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవడం.. విడాకులు ఇవ్వడం.. మళ్లీ పెళ్లి చేసుకోవడం.. దత్తపుత్రుడి దినచర్య అని విమర్శించారు.
భీమవరం ప్రజలు ఓడించిన దత్తపుత్రడు పొరుగు రాష్ట్రంలో ఉంటారని జగన్ చెన్నారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూశామని, కానీ, ప్యాకేజీల కోసం సొంత పార్టీ, సొంత నేతలను కూడా త్యాగాలు చేసే వారిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారని.. ఇలాంటి వారికి ఓటేస్తే.. మోసం చేయడం తప్ప మంచి చేయడం వారికి రాదన్నారు. సంక్షేమం అనే పెద్ద గీతను చెరిపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
నాలుగేళ్ల కోసారి పెళ్లిళ్లు చేసుకునే వారిని, ఒక్క భార్యతో కూడా మూడేళ్లు కలసి కాపురం చేయనివారిని గెలిపిస్తే.. మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఓటేయడం ధర్మ మేనా? అని అన్నారు. “మేం అమ్మ ఒడి అమలు చేశాం. అర్హులైన మహిళలకు ఇంటి పట్టా ఇచ్చాం. ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేశాం. ఇంత కన్నా మంచి పనిచేశామని చెప్పుకొనే ధైర్యం ఉంటే.. వారు(టీడీపీ-జనసేన) ఓటు అడగొచ్చు” అని జగన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates