కేసీయార్ హయాంలో ఏర్పాటైన జిల్లాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమీక్షకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ తొందరలోనే జారీ అవబోతోందని అధికారవర్గాలు చెప్పాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పడేనాటికి పది జిల్లాలు మాత్రమే ఉండేవి. వాటిని కేసీయార్ ముందు 31 జిల్లాలుగా విభజించారు. తర్వాత మరో రెండు జిల్లాలను చేర్చి మొత్తం 33 జిల్లాలుగా చేశారు. అయితే మొదట్లో 31 జిల్లాలు చేసినా తర్వాత 33 జిల్లాలుగా మార్చినా అందులో ఎలాంటి శాస్త్రీయతా లేదు. తనిష్టం వచ్చినట్లు చేసుకున్నారు.
దాంతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా కేసీయార్ ఎవరినీ లెక్కచేయకుండా తనిష్ట ప్రకారమే జిల్లాలను విడదీసేశారు. జిల్లాల విభజనలో ఒక పద్దతి పాడు లేకుండా పోయింది. ఒకే నియోజకవర్గం ఇపుడు మూడు జిల్లాల్లో ఉంది. అలాగే రెండే నియోజకవర్గాలతో సిరిసిల్ల జిల్లా ఏర్పాటైంది. కొడుకు కేటీయార్ కోసమే ఈ జిల్లా ఏర్పాటైందనే ఆరోపణలకు కొదవలేదు. ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటుచేయటంతో ఇప్పటికీ చాలా జిల్లాల్లో అధికారయంత్రాంగం లేదు.
ఇలాంటి సమస్యలను గుర్తించి జిల్లాలను భౌగోళిక, జనాభా ఆధారంగా సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకోసం రిటైర్డ్ జిడ్జి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటిని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికగా, భౌగోళిక స్వరూపాన్ని అనుసరించి జిల్లాలను సర్దుబాబు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతోంది. పనిలోపనిగా జనాభిప్రాయాన్ని కూడా సేకరించాలని కూడా అనుకున్నది. కేసీయార్ హయాంలో ఇలాంటి శాస్త్రీయ పద్దతులను అనుసరించలేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.
తొందరలో జరగబోబోతోందని అనుకుంటున్న జిల్లాల సర్దుబాటులో ఒక నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలోనే ఉంటుందన్నది కీలకమైనది. ఇపుడు రెండు నియోజకవర్గాలకు ఒక జిల్లా, ఏడు నియోజకవర్గాలకు మరో జిల్లాగా ఏర్పాటైంది. ఇలా ఎందుకు ఏర్పాటైందంటే అందుకు కేసీయార్ ఆలోచనలే కారణమనే ఆరోపణలకు కొదవలేదు. ఒక రకంగా జిల్లాల స్వరూపాన్ని కేసీయార్ అడ్డదిడ్డంగా మార్చేశారు. దాంతో మామూలు జనాలే కాదు అధికారయంత్రాంగం కూడా బాగా ఇబ్బంది పడుతోంది. అయినా కేసీయార్ ఎవరినీ పట్టించుకోలేదు.