వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయనను ఓడించాలనేది టీడీపీ వ్యూహం. ఎందుకంటే.. కత్తికి కత్తి! అన్న సామెత మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంపై వైసీపీ కన్నేసిన నేపథ్యంలో వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంపై టీడీపీ కూడా కన్నే సింది. ఈ నేపథ్యంలో కుదిరితే జగన్‌ను ఓడించడం.. లేకపోతే మెజారిటీని భారీగా తగ్గించడం అనే టార్గెట్‌ను నిర్దేశించుకుంది.
ఈనేపథ్యంలో పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్‌గా బీటెక్ రవిని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు. ప్రస్తుతం ఈయన నియోజకవర్గంలో పాదయాత్రలు, సమస్యలపై అధ్యయనాలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అండగా ఉంటున్నారు. దీంతో బీటెక్ రవి పేరు బాగానే వినిపిస్తోంది. ఇదిలావుంటే.. పులివెందులలో వైఎస్ కుటుంబానికి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకు ఈ దఫా కొన్ని కారణాలతో దూరమయ్యే పరిస్తితి వచ్చింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. తదనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీకి సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు.. ఈ సారి టీడీపీకి వేయకపోయినా.. మౌనంగా ఉండనుందనే సమాచారం వస్తోంది.
ఈ పరిణామాలకు తోడు.. వైఎస్ సునీత పట్ల సానుభూతి కూడా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామాలన్నీ కూడా.. బీటెక్ రవికి కలిసి వచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇది ఆయన కు గెలుపును అందిస్తుందా.. ? లేదా.. అనేది పక్కన పెడితే.. గత ఎన్నికల్లో వైసీపీ కి ఇక్కడ వచ్చిన మెజారిటీ మాత్రం ఈ దఫా భారీగా తగ్గనుందని టీడీపీ ఒక అంచనాకు వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.