వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులను మారుస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొంత వ్యతిరేకత కూడా వస్తోంది. అభ్యర్థులు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు. వేరే పార్టీలకు వలస కూడా పోతున్నారు. అయినప్పటికీ.. వైసీపీని గెలిపించుకోవాలంటే మార్పులు తప్పదనేది ఆ పార్టీ వ్యూహం ఈ క్రమంలో మంత్రులకు కూడా ఇప్పుడు సంకేతాలు పంపేసిందని సమాచారం.
విషయం బయటకు రాకముందే.. మంత్రులకు పక్కా సంకేతాలు పంపి.. వేరే నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మంత్రులు రోజా, గుమ్మనూరు జయరాంలకు వైసీపీ నియోజకవర్గం మార్పు ఖాయమని చెప్పినట్టు తెలిసింది. అయితే.. వారు కూడా మారుతున్న పరిణామాలకు అనుకూలంగా తమ తమ మానసిక స్థితిని కూడా ప్రిపేర్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రి రోజా .. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనను మార్చాల్సి వస్తే.. ఇబ్బంది ఏమీలేదని.. అల్టిమేట్‌గా జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక, గుమ్మనూరు జయరాం కూడా.. తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ప్రస్తు తం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జయరాం.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయకపోవచ్చనే వార్తలు జోరుగా వస్తున్నాయి.
ఈయన కూడా.. మానసికంగా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు అనే విషయా లను పక్కన పెడితే.. ప్రజల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటనేది అంచనా వేస్తున్న పార్టీ అధినేత సీఎం జగన్.. దాని ప్రకారమే మార్పులు చేర్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీని రెండో సారి కూడా గెలిపించుకోవాలన్న ప్రధాన సంకల్పంతోనే ఆయన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దీనిని కొందరు అర్ధం చేసుకుంటున్నారు. మరికొందరు పట్టుదలలకు పోతున్నారు. అంతే తేడా!!
Gulte Telugu Telugu Political and Movie News Updates