విభజన హామీల విషయంలో ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్న వాతావరణాన్ని ఛేదిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసి వచ్చారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాల్సిందేనని, ఈ హామీలకు ఇప్పటికే పదేళ్లు గడిచిపోయాయని ఇప్పటికైనా హామీలను అమలు చేయాల ని సీఎం రేవంత్ నేరుగా ప్రదానిని కలిసి డిమాండ్ చేశారు. దీనిపై ఒక కదలిక అయితే వచ్చింది.
ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెద్దగా ఈ దిశగా కదలిక అయితే రాలేదు. కేంద్రంపై దండెత్తుతామని పదే పదే చెప్పినా.. విభజన హామీల విషయానికి వస్తే.. బీఆర్ ఎస్ కేవలం ప్రకటనలకే పరిమిత మైందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికలకు ముందు.. ఈ తరహా కదలిక రావడం ఇటు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. నేరుగా ప్రధానిని కలిసి విభజన సమస్యపై ప్రశ్నించడం గమనార్హం.
మరోవైపు.. ఇవే సమస్యల పరిష్కారం కోసం ఏపీలోనూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ మెట్రో వంటివి అపరిష్కృతంగా ఉన్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిధులు కూడా అవసరం. ఎన్నికల్లో ఎప్పటికప్పుడు ఈ అంశాలు చర్చలకు వస్తున్నాయి. వీటిపై పోరడతామని చెబుతు న్నప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అయితే.. విభజన హామీలపై రెండు రాష్ట్రాలూ కలిసి పోరాడితే కొంత కదలిక వస్తుందని మేధావి వర్గాలు చెబుతున్నాయి.
కానీ, రెండురాష్ట్రాలు ఇప్పటి వరకు కలిసి పోరాడింది లేదు. కారణాలు ఏవైనా.. కేంద్రంపై కలిసి ఒత్తిడి కూడా తేలేదు. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ దూకుడు పెంచడం.. కేంద్రంలోని మోడీ సర్కారులో కదలిక తెచ్చేలా వ్యవహరించిన నేపథ్యంలో ఏపీ కూడా ఇదే చొరవ ప్రదర్శించాలని అంటున్నారు పరిశీలకులు. ఇదే చొరవతో ముందుకు సాగితే.. ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates