బీజేపీ అధిష్ఠానానికి తప్పు తెలుసొచ్చింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు పార్టీకి ఎంతటి నష్టం చేసిందో ఇప్పుడు అర్థమైనట్లుంది. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ కేసీఆర్ కు అనుకూలంగా ఉండేందుకు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చబోతోంది. మళ్లీ తెలంగాణ పగ్గాలు బండి సంజయ్ కే అందించేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
తెలంగాణలో బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే ఉన్న సమయంలో 2020 మార్చిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. తనదైన దూకుడుతో రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించారు. దీంతో రాష్ట్రంలో పార్టీకి గ్రాఫ్, ప్రజల్లో ఆదరణ, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగాయి. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రభావమే చూపించే ఆస్కారముందనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఈ ఏడాది జులైలో సంజయ్ ను తప్పించి తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. దీంతో రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. కేసీఆర్ కు అనుకూలంగా ఉండేందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలే అసంత్రుప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా కొంతమంది బీజేపీని వీడి వెళ్లారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ 8 చోట్ల గెలిచింది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు పెరిగాయి. ఓట్ల శాతం కూడా పెరిగింది. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేయడం ఇష్టం లేక చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. అదే బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే రాష్ట్రంలో బీజేపీ మరో 20కి పైగా స్థానాల్లో గెలిచేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీఆర్ఎస్ గెలుస్తుందనుకుంటే కాంగ్రెస్ నెగ్గింది. దీంతో బీజేపీ తమ వ్యూహాన్ని మార్చిందనే చెప్పాలి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ ఉంది. కిషన్ రెడ్డితో అది సాధ్యం కాదని భావిస్తున్న అధిష్ఠానం మరోసారి బండి సంజయ్ నే తెలంగాణ అధ్యక్షుడిగా నియమించే ఆస్కారముంది. అదే జరిగితే రాష్ట్రంలో మళ్లీ బీజేపీ పుంజుకునే అవకాశముంది.