సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయ్యిందా ? అవుననే అంటున్నాయి ఎన్నికల కమీషన్ వర్గాలు. ఫిబ్రవరి 10 వ తేదీన నోటిఫికేషన్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల కమీషన్ రెడీ అయినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ వర్గాలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు సమాచారం కూడా అందించిందంట. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి ఉన్నతాధికారులు రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటించబోతున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవబోతున్నట్లు తెలిసింది.
సున్నితమైన నియోజకవర్గాలు అంటే ఘర్షణలకు అవకాశం ఉన్న ఫ్యాక్షన్ నియోజకవర్గాలు, అలాంటి నియోజకవర్గాల్లో ప్రశాంతమైన పోలింగ్ జరగటానికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రానికి అవసరమైన కేంద్ర భద్రతా బలగాల సంఖ్య, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, రిజర్వ్ సిబ్బంది లాంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా సమీక్షలు చేయబోతున్నారు. సిద్ధంచేయాల్సిన పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా ర్యాండంగా పరిశీలించబోతున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం మార్చి-ఏప్రిల్ లో కాకుండా ముందుగానే జరుగుతుందనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతోంది.
ఈమధ్యనే జరిగిన మంత్రివర్గ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు షెడ్యూల్ కన్నా ఎన్నికలు 20 రోజులు ముందే జరగచ్చని చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకు తగ్గట్లే జరగబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికపై జగన్ చాలా కాలంగా దృష్టిపెట్టారు. ఇపుడు మంత్రులు, ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను మార్చటం కూడా బహుశా ఇందులో బాగమేనేమో. ఏదేమైనా రేపో ఎల్లుండో ఎన్నికలు జరగబోతున్నాయన్నంత స్పీడుగా జగన్ మార్పులు చేసేస్తున్నారు.
ముందస్తు ఎన్నికల సమాచారాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబునాయుడు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ తరపున పోటీచేయాల్సిన అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చేశారు. అలాగే పొత్తులో జనసేనకు ఇవ్వాల్సిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాల వివరాలను ప్రకటించటం ఒకటే మిగిలుంది. ఈ ముచ్చట కూడా అయిపోతే ప్రచారంతో రెండు పార్టీల అభ్యర్ధులు జనాల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటికే కొందరు తమ్ముళ్ళు ప్రచారం చేసుకుంటున్నా అది అధికారికం కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates