ఎస్సీ రాంసింగ్, వైఎస్ సునీతలపై కేసు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ కేసులో వివేకా కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల, సీబీఐ ఎస్పీ రాంసింగ్ లపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, పులివెందుల కోర్టు ఆదేశాల ప్రకారమే ఈ కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారు అంటూ వివేకా మాజీ పీఏ కృష్ణా రెడ్డి కొద్ది నెలల క్రితం పులివెందుల కోర్టును ఆశ్రయించారు.

వివేకా హత్యకు సంబంధించి కొందరు నేతల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలంటూ కొందరు సీబీఐ అధికారులు, ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి చేస్తున్నారని ఆయన పులివెందుల కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులకు అనుగుణంగా ఉండాలంటూ సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరినా ఫలితం లేదని, ఆ క్రమంలోనే తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన పులివెందుల కోర్టు…. సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ముగ్గురిపై ఐపిసి సెక్షన్ 156(3) కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మరి, ఈ వ్యవహారంపై వైఎస్ సునీత, సీబీఐ అధికారుల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.