రేవంత్ తొలి కేబినెట్ భేటీ..ఎవరికి ఏ శాఖ అంటే..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా మల్లు పట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సీఎం కాకుండా 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళసై ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, వీరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయించబోతున్నారు అన్న విషయంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. తాజాగా ఆ 11 మంది మంత్రులకు శాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయిస్తూ కీలక ప్రకటన చేశారు.

సీఎం పదవి రేసులో ఉండి డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్న మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖను కేటాయించారు. ఇక, సీఎం రేసులో ఉన్న మరో అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ ఇచ్చారు. ఎస్సీ నేతగా పేరున్న దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పురపాలక శాఖ దక్కింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆర్థిక శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి నియమించారు. ఇక, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటిపారుదల శాఖను కేటాయించారు.

పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ కేటాయించారు. వాస్తవానికి సీతక్కకు డిప్యూటీ సీఎం లేదా హోంశాఖ లభిస్తుందని అంతా భావించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం సూచన ప్రకారం గిరిజన సంక్షేమ శాఖను కేటాయిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, హోటల్ తాజ్ కృష్ణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వారు బయలుదేరనున్న నేపథ్యంలో వారితో రేవంత్ మాట్లాడుతున్నారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కొత్త కేబినెట్ తొలిసారిగా భేటీ కాబోతోంది. మరోవైపు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా శశిధర్ రెడ్డిని నియమించారు.