బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ తప్పుచేశారనే అనిపిస్తోంది. రెండోచోట్ల పోటీచేయటమే ఆ తప్పు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు కేసీయార్ సొంత నియోజకవర్గమైన గజ్వేలులో కూడా పోటీచేశారు. హుజూరాబాద్ లో గెలుపు మీద నమ్మకంతోనే గజ్వేలులో కేసీయార్ పై తొడకొట్టారు. బహుశా ఈటల ఉద్దేశ్యంలో గజ్వేలులో కేసీయార్ ను టెన్షన్ కు గురిచేయటమే అయ్యుండచ్చు. గెలుపు మీద ఆశలు కన్నా గజ్వేలు వదిలేసి ఇతర నియోజకవర్గాల్లో కేసీయార్ ను ఫ్రీగా తిరగనీయకుండా కట్టడి చేయటమే అయ్యుండచ్చు.
కేసీయార్ గురించి ఆలోచించి తన నియోజకవర్గంలో ఈటల దెబ్బతిన్నారు. గజ్వేలులో కేసీయార్ మీద ఈటల పోటీచేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్ చీఫ్ గా కేసీయార్ రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయకుండా ఎలాగుంటారు ? కేసీయార్ ను గజ్వేలుకు వీలైనంతలో పరిమితం చేయాలని ఈటల అనుకోవటమే తప్పు. దీని వల్ల ఏమైందంటే తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ ను వదిలేసి ఎక్కువ రోజులు గజ్వేలులో గడపాల్సొచ్చింది.
దాని ఫలితమే రెండు నియోజకవర్గాల్లోను ఓటమి. అదేదో ముతక సామెతలో చెప్పినట్లు సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లోను ఓడిపోయారు. కేసీయార్ ను ఇబ్బంది పెడదామని నామినేషన్ వేసిన్ గజ్వేలులోనూ ఓడిపోయారు. అసలు గజ్వేలు గురించి ఆలోచించకుండా కేవలం హుజూరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యుంటే ఈటల గెలిచుండేవారేమో. తన గెలుపుపైన నమ్మకంలేకనే బీఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు.
తనకు ఓట్లేసి గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోడ్డుషోలో కౌశిక జనాలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆత్మహత్య చేసుకుంటామని చెప్పటంలో అర్ధమేంటి ? గెలుపు మీద నమ్మకం లేనపుడే కదా ఇలాంటి చీప్ ట్రిక్కులకు దిగుతారు. సరే కారణం ఏదైనా 17,158 ఓట్ల మెజారిటితో కౌశిక్ గెలిచారు. అదే ఈటల హుజూరాబాద్ లో మాత్రమే పోటీచేసుంటే బహుశా ఈటలే గెలిచుండే వారేమో. ఏదేమైనా తనను తాను ఎక్కువగా ఊహించుకుని రెండుచోట్ల పోటీచేసి ఈటల తప్పుచేశారనే అనిపిస్తోంది.