తొందరలోనే చంద్రబాబునాయుడు ఫుల్లు బిజీ అవ్వబోతున్నారు. దేశంలోని ప్రముఖ లాయర్లలో ఒకరైన సిద్ధార్ధలూథ్రా కొడుకు పెళ్ళి రిసెప్షన్ కు భువనేశ్వరితో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుని మళ్ళీ 29 రాత్రికి తిరుపతికి చేరుకుంటారు. 30వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం, సింహాచలం దేవస్ధానాలను కూడా దర్శించుకుంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన అయిపోయిన తర్వాత డిసెంబర్ లో మంచిరోజు చూసుకుని జనాల్లోకి అడుగుపెట్టబోతున్నారు.
తొందరలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగసభల నిర్వహణకు ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే ఏకైక ధ్యేయంగా చంద్రబాబు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. రెండుపార్టీలు కలిసిన తర్వాత బహిరంగసభలు పెడితే బాగుంటుందని సీనియర్ తమ్ముళ్ళు సలహాలిచ్చారట. దాని ప్రకారం ఉభయగోదావరి జిల్లాల్లో ఒకచోట, రాయలసీమలో మరో చోట, కోస్తా జిల్లాల్లో ఇంకో బహిరంగసభను నిర్వహిస్తే బాగుంటుందని చంద్రబాబు అనుకున్నారట.
పై మూడు ప్రాంతాల్లో కూడా బహిరంగసభలు ఎక్కడ పెట్టాలన్న విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే బహిరంగసభలు పెడితే బాగా ఎఫెక్టివ్ గా ఉంటుందని ఆలోచిస్తున్నారు. అందుకనే తగిన నియోజకవర్గం ఏదన్న విషయం కసరత్తులు జరగుతున్నది. తొందరలోనే ఈ మూడు నియోజకవర్గాలపై ఒక క్లారిటి వస్తుందని పార్టీవర్గాల సమాచారం. పనిలో పనిగా రాజోలు నియోజకవర్గంలో మొదలైన లోకేష్ పాదయాత్రను చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
బహిరంగసభల నిర్వహణ సమయానికి పాదయాత్ర పూర్తయ్యేట్లుగా ప్లాన్ జరిగిందట. యువగళం పూర్తియపోతే అక్కడ లోకేష్ కూడా పాల్గొంటారు. లేకపోతే తర్వాత ఉత్తరాంధ్రలో సందర్భం చూసుకుని బహిరంగసభ ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ అయ్యారట. ఏదేమైనా జైలులో నుండి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళే సందర్భం గ్రాండ్ గా ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. పైగా ఇపుడు జనసేన కూడా తోడుంది కాబట్టి మరింత గ్రాండ్ గా బహిరంగసభలను ఏర్పాటు చేయబోతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates