ముందే తెలిసినా లాభం లేదు రాశీ

గత ఏడాది విడుదలైన ‘తెలుసు కదా’ అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ ఏజ్ కాన్సెప్ట్ తో దర్శకురాలు నీరజ కోన ఏదో కరణ్ జోహార్ తరహాలో రిలేషన్ షిప్ మీద కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది కన్విన్సింగ్ గా లేకపోవడంతో ఆడియన్స్ తిరస్కరించారు. జాక్ ఫ్లాప్ తర్వాత ఇదైనా కాస్త ఊరట ఇస్తుందనుకున్న సిద్ధూకు తెలుసు కదా ఇచ్చిన షాక్ చిన్నది కాదు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం రాశిఖన్నా.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లలో భాగంగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుసు కదా ప్రస్తావన తీసుకొచ్చింది. షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇది వర్కౌట్ కాదని అనిపించిందని, తనకు నచ్చని విషయాలను యూనిట్ తో తరచు చర్చించినా ఫలితం లేకపోయిందని, ఆఖరికి క్లైమాక్స్ గురించి విభేదించినా కూడా చివరికి రాజీ పడాల్సి వచ్చిందని, దర్శకుల విజన్ ను అనుసరించి చెప్పింది చేశానని, చివరికి అనుకున్న రిజల్టే వచ్చిందని వివరించింది.

రాశిఖన్నానే కాదు ఎందరో ఆర్టిస్టులకు ఇది అనుభవమే. ఎందుకో ఇది వర్కౌట్ కాదేమోనని భావించి డైరెక్టర్లతో కొందరు నేరుగా ఉన్న మాట చెప్పేస్తారు. కానీ తాము రాసింది, తీసింది చాలా గొప్పదనే భావనలో ఉన్న దర్శకులు ఇలాంటి మాటలు వినరు. తీరా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాక అవును మీరు చెప్పింది నిజమేనని నిట్టూరుస్తారు. తెలుసు కదా విషయంలో కూడా ఇదే జరిగింది. రాశి ఖన్నా సిక్త్ సెన్స్ చెప్పింది, భయపడింది దర్శకురాలు ముందే గుర్తించలేదు.

దీని సంగతలా ఉంచితే గ్లామర్ టచ్ లో ఉన్న పాత్రను ఉస్తాద్ భగత్ సింగ్ లో చేసినా రాశిఖన్నా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఎగ్జైటింగ్ గా ఉంది. శ్రీలీల ఉన్నప్పటికీ తనకు దక్కాల్సిన ప్రాధాన్యం హరీష్ శంకర్ ఇచ్చారని, ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ మధ్య గ్యాప్ వచ్చేసి సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న రాశిఖన్నాకు ఆమె కోరుకున్న విజయం మరి పవన్ కళ్యాణ్ మూవీతో అయినా దక్కుతుందేమో గురువారం తేలనుంది.