కీలకమైన ఎన్నికల వేళ.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే వాదన వినిపిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు బంధు పథకం నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దని.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపించింది. దీంతో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీకి భారీ దెబ్బతగిలినట్టు అయింది.
వాస్తవానికి.. కొన్నాళ్ల కిందటే.. కేంద్ర ఎన్నికల సంఘానికి రైతు బంధు నిధుల విడుదల పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకం కాబట్టి.. ఇబ్బంది లేదు. అయితే.. ఎన్నికలు 30వ తారీకున జరుగుతున్న నేపథ్యంలో.. ఈ నెల 28 సాయంత్రంలోపు ఈ పథకం కింద నిధులు విడుదల చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
దీంతో బీఆర్ ఎస్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28(మంగళవారం) రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు.. సర్వం సిద్ధమైంది. అయితే.. ఇంతలోనే ఈ విషయం రాజకీయంగా మరోసారి వివాదంగా మారింది. ఎన్నికల ప్రచార సభల్లో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంపై విపక్ష కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిధుల విడుదలపై స్టే విధించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయొచ్చని తెలిపింది.