తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న(8 స్థానాలు) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వరుసగా రెండో రోజూ ఉమ్మడి పార్టీల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తాను బీఆర్ ఎస్‌ను , కాంగ్రెస్‌ను తిట్టలేనని చెప్పారు. బీఆర్ ఎస్‌ను తిట్టాలని, కాంగ్రెస్ నేత లను తిట్టాలని కొందరు కోరుతున్నారని తెలిపారు.
అయితే.. తనకు బీఆర్ ఎస్‌లోనూ.. కాంగ్రెస్‌లోనూ.. మిత్రులు ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తనకు మిత్రుడని, రేవంత్ రెడ్డితోనూ స్నేహం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. అయితే.. స్నేహం-రాజకీయం వేర్వేరే అయినా.. రాష్ట్ర మంతా తిరిగి పరిస్థితులు చూడలేదు కాబట్టి తాను బీఆర్ ఎస్‌ను తిట్టలేనని చెప్పారు. అయితే, తెలంగాణలోనూ ఏపీ మాదిరిగానే రాజకీయాలు ఉన్నాయని వ్యాఖ్యానించా రు. గత పాలకులు చేసిన తప్పే పునరావృతం అవుతోందని అన్నారు.
కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లోనే భూముల ధరలు పెరుగుతున్నాయని.. ఇతర జిల్లాల మాటేంటని ఆయన ప్రశ్నించారు. పరీక్ష పేపర్స్ లీకుతోఎంతో మంది నిరుత్సాహానికి గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్(కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ) పాలన రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇలా డబుల్ ఇంజన్ సర్కారు వల్లే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని తాను భావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు దక్కాలని.. వారిని చులకనగా చూడొద్దని పవన్ వ్యాఖ్యానించారు.