భూ సమస్యల పరిష్కారం కోసం కేసీయార్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ బాగా వివాదాస్పదమైంది. ధరణి మొత్తం లోపాల పుట్టగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో కేసీయారేమో అన్నీ సమస్యలకు చెక్ పెట్టగలిగింది ధరణి మాత్రమే అని బహిరంగసభల్లో ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. ధరణి వల్లే సమస్యలన్నీ పరిష్కారమైనట్లుగా కేసీయార్ చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే బిక్కనూరు రోడ్డుషోలో కేటీయార్ మళ్ళీ అధికారంలోకి రాగానే ధరణిలోని లోపాలను పరిష్కరిస్తామని చెప్పారు.
ధరణి పోర్టల్ విషయంలో కేటీయార్ చేసిన తాజా ప్రకటన ప్రకారం పోర్టల్లో లోపాలున్నట్లు అంగీకరిస్తున్నట్లే కదా. ధరణితో 90 శాతం మందికి న్యాయం జరిగిందని, 10 శాతం మంది మాత్రమే ఇబ్బందులు పడుతున్నట్లు కేటీయార్ అంగీకరించారు. అయితే ఇక్కడ కేటీయార్ అబద్ధాలు చెప్పారు. ధరణితో ఇబ్బందులు పడుతున్నది పదిశాతం మంది కాదు ఇంకా చాలామందే. రైతులు, భూ యజమానుల దగ్గరున్న పాస్ బుక్కుల్లోని భూ వివరాలకు ధరణి పోర్టల్లోని భూ వివరాలకు చాలా తేడాలుంటున్నాయని గోల జరుగుతోంది.
పాస్ పుస్తకాల్లోని వివరాల ప్రకారం ధరణి పోర్టల్లో వివరాలను సవరించాలని యజమానులు అడుగుతుంటే రెవిన్యు అధికారులు పట్టించుకోవటంలేదు. నెలలు, సంవత్సరాలు తిరుగుతున్నా రెవిన్యు అధికారులు లెక్కచేయటంలేదు. ధరణి పోర్టల్ లోని వివరాలే వాస్తవాలని రెవిన్యు అధికారులు యజమానులకు చెబుతున్నారు. అయితే పోర్టల్లో భూ వివరాలు తప్పుగా నమోదుచేశారని యజమానులు ఎంత చెబుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదు. పాస్ బుక్కుల్లోని వివరాలు అంతకుముందు రెవిన్యు రికార్డుల్లోని వివరాలు ఒకటిగానే ఉన్నాయి.
అయితే పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రెవిన్యు అదికారులు కావాలనే భూ విస్తీర్ణాన్ని తగ్గించి నమోదుచేయటంతోనే పాస్ బుక్కుల్లో తేడాలు వచ్చినట్లు యజమానులు గోలచేస్తున్నారు. యజమానులు చెప్పినట్లు లోపాలను సర్దుబాటు చేస్తే పోర్టల్లో తప్పులున్నాయని అంగీకరించినట్లవుతుందని అధికారులు పట్టించుకోవటంలేదు. దాంతో యజమానుల గోల రోజురోజుకు పెరిగిపోతోంది. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ సీన్ లోకి ఎంటరై ధరణి పోర్టల్ ను రద్దుచేసి కొత్తగా భూభారతి అనే వ్యవస్ధను తీసుకొస్తామని చెబుతున్నది. దీన్ని కేసీయార్ వ్యతిరేకిస్తున్నారు. మరి భూ యజమానులు కేసీయార్, రేవంత్ లో ఎవరిని సమర్ధిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates