వచ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పక్షాలైన టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీల అధినేతలు కూడా తరచుగా భేటీ అవుతున్నారు. అయితే.. ఈ విషయంలో క్షేత్రస్థాయి పరిణామాలు మాత్రం ఇరు పార్టీలకు మింగుడు పడడం లేదు. పొత్తుల విషయంలో క్షేత్రస్థాయి నాయకులకు వివరించి.. సమన్వయం సాధించే దిశగా వేస్తున్న అడుగులు కూడా ఒకింత తడబడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన-టీడీపీ కార్యకర్తలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే. కొన్ని ప్రాంతాల్లో ఇవి సక్సెస్ అవుతున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం విఫలమవుతున్నాయి. తాజాగా కాకినాడలో నిర్వహించి సమన్వయ కార్యక్రమం రసాభాసగా మారింది.
పిఠాపురంలో ఈ రెండు పార్టీల సమావేశం వివాదంగా మారింది. కీలకమైన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలోనూ నేతలు కలివిడి ప్రదర్శించలేక పోయారు. గోకవరం మండల జనసేన పార్టీ కన్వినర్ ఉంగరాల మణిరత్నంపై ఇటీవల టీడీపీ నేత గణేష్ దాడి చేసిన అంశాన్ని సమావేశం ప్రారంభంలోనే సూర్యచంద్ర ప్రస్తావించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగానే.. దాడి వ్యవహారాన్ని తేల్చాలంటూ పట్టుబట్టారు. జ్యోతుల నవీన్ కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన టీడీపీ–జనసేన ఆత్మీయ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన బాబు హాజరయ్యారు. అయితే.. ఇక్కడ సీనియర్లు, జూనియర్లు అనే వివాదం తెరమీదికి వచ్చింది. దీంతో ఇక్కడ కూడా తోపులాటలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా చూస్తేక్షేత్రస్థాయిలో సమన్వయం సాధించ డం ఇప్పుడు కష్టంగా మారిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates