తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీఆర్ ఎస్ ఎంపీ పై కత్తితో దాడి జరిగిన ఘటన మరువ క ముందే.. తాజాగా మరో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడడం తో తొలుత జిల్లా ఆసుపత్రికి.. తర్వాత.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే వాహనం పూర్తిగా దెబ్బతిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ ఈ ఘటన అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత ఉద్రిక్తతలను సృష్టించింది.
ఏం జరిగంది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరోసారి టికెట్ పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్నిముమ్మరం చేశారు. ఇలా.. శనివారం రాత్రి పొద్దు పోయే వరకు ఆయన ప్రచారంలోనే ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ తరఫున ఇక్కడ నుంచిపోటీ చేస్తున్న వంశీకృష్ణ.. గువ్వల తన ప్రచారంలో డబ్బులు పంచుతున్నారని.. ఆయన కారులో డబ్బులు ఉన్నాయని ఆరోపించారు.
దీంతో వంశీ కృష్ణ అనుచరులు కొందరు గువ్వల ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో దారికాచి కారును నిలువరించారు. కారును తనిఖీ చేయాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్-బీఆర్ ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని తోపులాటకు దిగారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు మరింత దూకుడుగా.. రాళ్ల వర్షం కురిపించడంతో గువ్వల కారు ధ్వంసమైంది.
అంతేకాదు.. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గువ్వల కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి.. ప్రాధమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా.. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ ఎస్-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. ఇప్పుడు భౌతిక దాడులకు తెగబడడం.. మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.