తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ మొదలుకాగానే ఐటి శాఖ దాడులు మొదలుపెట్టింది. జరుగుతున్న దాడులు కూడా ఏకపక్షంగా టార్గెట్ చేసి జరుగుతున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటివరకు జరిగిన దాడులన్నీ కేవలం కాంగ్రెస్ అభ్యర్ధుల మీదనే కాబట్టి. అదికూడా అభ్యర్ధులు నామినేషన్లు వేసే రోజే దాడులు జరిగాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్ధులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, విక్రాంత్ రెడ్డితో పాటు పారిజాత నర్సింహారెడ్డి ఇళ్ళు, ఆఫీసులు, బంధువుల ఇళ్ళపైన కూడా దాడులు జరిగాయి.
ఎప్పుడైతే దాడులన్నీ కేవలం కాంగ్రెస్ అభ్యర్ధుల మీదే జరగటంతో వెంటనే బీజేపీ, బీఆర్ఎస్ పై ఆరోపణలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీలు కూడబలుక్కునే కాంగ్రెస్ అభ్యర్ధులపైన ఐటి శాఖ ఉన్నతాధికారులతో దాడులు చేయిస్తున్నట్లు హస్తంపార్టీ అభ్యర్ధులు, నేతలు మండిపోతున్నారు. నిజంగానే బీఆర్ఎస్-బీజేపీలు ప్రత్యర్ధిపార్టీలే అయితే రెండు పార్టీల అభ్యర్ధుల మీద కూడా దాడులు జరగాలి కదాని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధుల మీద దాడులు జరగకపోయినా కనీసం బీఆర్ఎస్ అభ్యర్ధుల మీదైనా జరగాలి కదాన్న ప్రశ్నకు రెండుపార్టీలు సమాధానం చెప్పలేకపోతున్నాయి.
ఐటి దాడుల తీరుతో జనాల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే రియాల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అన్ని పార్టీల తరపున పోటీలో ఉన్నారు. కానీ దాడులు మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధులను టార్గెట్ చేసుకున్నట్లుగా మాత్రమే జరుగుతున్నాయి. పొంగులేటిని అయితే అధికారులు నామినేషన్ కూడా వేసుకోనీయకుండా అడ్డుకున్నారు. చివరకు అతికష్టం మీద రెండు గంటలు టైం తీసుకుని నామినేషన్ వేసి మళ్ళీ అధికారుల ముందుండాల్సొచ్చింది.
ఇలాంటి ఘటనలన్నీ కాంగ్రెస్ అభ్యర్ధులను వేధించటానికే అనే విషయం జనాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి. ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్ధులను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏకమై ఐటి శాఖను ముందుపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కనబడుతోంది. ఇదే విషయాన్ని జనాలు కూడా నమ్ముతున్నారు. ఒకపుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్, బీజేపీ ఏకమవ్వటంతోనే కవిత అరెస్టు జరగలేదన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఇపుడు మళ్ళీ జనాలకు గుర్తుచేస్తున్నారు. అలాగే ఇపుడు కూడా రెండుపార్టీలు ఏకమైపోయాయని కాంగ్రెస్ నేతల ఆరోపణల్లో జనాలు లాజిక్కును చూస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో ఏమో.