పంతం నెగ్గించుకున్న ఈటల

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పంతం నెగ్గించుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓ వైపు తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ కు పోటీ ఇచ్చేందుకు గజ్వేల్ బరిలో దిగుతున్న ఈటల.. ఇప్పుడు వేములవాడ విషయంలోనూ అనుకున్నది సాధించారు. తనను నమ్మి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తుల ఉమకు వేములవాడ టికెట్ వచ్చేలా చూసుకున్నారు. ఈ టికెట్ ను తుల ఉమకు ఇప్పించడం కోసం పట్టుబట్టి మరీ ఈటల అధిష్ఠానాన్ని ఒప్పించారు.

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2021 ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే సమయంలో తుల ఉమ.. ఈటల వెంటే నిలిచారు. ఆయన అండగా ఉంటూ బీఆర్ఎస్ నుంచి ఉమ బయటకు వచ్చేశారు. తనకు మద్దతుగా ఉన్న ఉమకు వేములవాడ టికెట్ ఇప్పిస్తానని ఈటల హామినిచ్చారు. కానీ మధ్యలో బండి సంజయ్ స్థానంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఈటల మాట సాధ్యమయ్యేలా కనిపించలేదనే చెప్పాలి.

వేములవాడలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ ను కిషన్ రెడ్డి బీజేపీలో చేర్పించారు. దీంతో ఈ టికెట్ వికాస్ కే వస్తుందనేలా పరిస్థితి మారింది. దీంతో వేములవాడ టికెట్ కోసం కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల అనేలా వార్ మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఇద్దరూ ఈ టికెట్ కోసం అధిష్ఠానం దగ్గర పట్టుబట్టినట్లు సమాచారం. కానీ చివరకు ఈటల వెంట బీఆర్ఎస్ నుంచి వచ్చిన తుల ఉమకే బీజేపీ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. చివరకు ఈటల పంతం నెగ్గింది. దీంతో ఇప్పుడు వికార్ వర్గీయుల తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.