రాబోయే ఎన్నికల్లో పార్టీని జిల్లాలో మాజీమంత్రి, జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువని చెప్పుకునే బాలినేని శ్రీనివాసులరెడ్డే ముంచేసేట్లుగా ఉన్నారు. పార్టీ మీద అలగటం, ప్రత్యర్ధులకు పెద్ద అస్త్రమిచ్చినట్లు అవుతోంది. పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి బలహీన పరుస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మొత్తం 12 నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో వైసీపీ 8 చోట్ల గెలిచింది. రాబోయే ఎన్నికల్లో మొత్తం 12కి 12 సీట్లూ గెలవాలని ఒకవైపు జగన్ పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో జిల్లాలో పంచాయితీల పేరుతో పార్టీని బాలినేని బాగా బలహీనపరుస్తున్నారు.
ఈ విషయమంతా జగన్ కు పూర్తిగా తెలిసినా ఇంకా మాజీమంత్రిని ఎందుకు భరిస్తున్నట్లు ? ఏదో దగ్గర బంధువని మాత్రం భరించటంలేదు. తల్లి, చెల్లెలు, మేనమామ విషయంలోనే బంధుత్వాన్ని చూడని జగన్ దగ్గర బంధువైన బాలినేనిని బంధుత్వం పేరుతో భరించరని అందరికీ తెలుసు. బాలినేని అదృష్టమే జగన్ యాక్షన్ తీసుకోకుండా కాపాడుతున్నట్లుంది. ఎంతకాలం బాలినేని అదృష్టం మీద ఆధారపడి వైసీపీలో రాజకీయాలు చేస్తారో చూడాలి.
ఎంతో సన్నిహితులని ముద్రపడిన వాళ్ళని కూడా జగన్ ఒక స్ధాయివరకే భరిస్తారు. ఈ విషయం గతంలో చాలా సందర్భాల్లో నిరూపణైనా బాలినేని తన పద్దతిని మార్చుకోవటంలేదు. బావ వైవీ సుబ్బారెడ్డితో వ్యక్తిగత విభేదాలను బాలినేని పార్టీపైన చూపిస్తున్నారు. బాలినేని వ్యవహారం వల్ల ప్రకాశం జిల్లాలో పార్టీ ఇప్పటికే పలుచనైపోయింది. బాలినేని వల్ల పార్టీకి ఏమిటి ఉపయోగమో జగనే డిసైడ్ చేసుకోవాలి. చీటికి మాటికి అలగటం మొత్తం మీడియా దృష్టంతా తనపైనే మరలేట్లు చేసుకోవటం, రెండు రోజులు వార్తల్లో వ్యక్తిగా ఉండటం మినహా బాలినేని చేస్తున్నదేమీలేదు.
ల్యాండ్ వివాదం విషయంలో ఆదివారం జగన్ ముందు బాలినేని పంచాయితి జరగబోతోంది. బావ-మరిది అంటే వైవీ, బాలినేని ఇద్దరిని రమ్మని జగన్ ఆదేశించారు. ఈ పంచాయితీని జగన్ ఇక్కడతో ఆపేయకపోతే ముందు ముందు పార్టీకి మరింత తలనొప్పిగా తయారవ్వటం ఖాయం. క్షేత్రస్ధాయిలో వ్యవహారాలను చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో పార్టీకి బాలినేనే పెద్ద తలనొప్పిగా తయారవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. మరీ తలనొప్పిని జగన్ ఎలా వదిలించుకుంటారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates