కరోనా కేసుల విషయంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు చాలా రాష్ట్రాలకు భిన్నంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున టెస్టులు చేయించటం.. భారీగా క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు.. ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు వ్యవహారాలకు చెక్ చెప్పటం.. పేషెంట్లకు ఇచ్చే డైట్ వరకు అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు తానే స్వయంగా చూస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం ఇంత కష్టపడుతున్నా.. కొందరి కారణంగా ప్రభుత్వానికి.. ప్రజలకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు.
తాజాగా అలాంటి అంశమే ఒకటి తెర మీదకు వచ్చింది. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో కేసులు పెద్ద ఎత్తున నమోదు కావటం తెలిసిందే. ఒక దశలో రోజుకు పదివేల కేసుల చొప్పున నమోదు కావటంతో.. భారీగా ఒత్తిడికి గురైనప్పటికి త్రోటుపాటుకు గురి కాకుండా అందరికి వైద్య సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే.. కొందరు స్వార్థపరులు.. బ్లాక్ మార్కెట్ల వారి కారణంగా ప్రభుత్వ ప్రయత్నాల్ని దెబ్బ తీస్తోంది.
కేసుల నమోదు భారీగా పెరిగిపోవటంతో ఏపీలో ఇప్పుడు ఆక్సిజన్ అవసరం పెరిగింది. దీంతో.. కొరత చోటు చేసుకుంది. గతంలో రోజుకు వెయ్యి కేజీల ఆక్సిజన్ వినియోగించిన ఆసుపత్రులు.. ఈ రోజున నాలుగైదు వేల కేజీల ఆక్సిజన్ వినియోగిస్తున్నారు. ఇదొక్కటి చాలు ఆక్సిజన్ వినియోగం ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ కేజీహెచ్ లో కరోనాకు ముందు నెలకు సరాసరిన 80-90 టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తే.. ఇప్పుడు ఏకంగా 150 టన్నులకు చేరింది.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మార్చటం తెలిసిందే. ఈ ఆసుపత్రిలో మూడు ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి. పదివేల కేజీల ట్యాంకు ఒకటి.. రెండు వేల కేజీల ట్యాంకు ఒకటి.. వెయ్యి కేజీల ట్యాంకులు మూడున్నాయి. పదివేల కేజీల సామర్థ్యం ఉన్న ట్యాంక్ ను ఒకసారి నింపితే పదిరోజులపాటు రోగులకు సరిపోయేది. ఇప్పుడదే కేవలం మూడు రోజులకే వస్తోంది. పెరుగుతునన కేసులకు అనుగుణంగా ఆక్సిజన్ వినియోగం భారీగా పెరిగింది.
ఈ పరిస్థితిని అసరాగా చేసుకొని ఆక్సిజన్ కొరతను క్రియేట్ చేసి.. భారీ ఎత్తున ధరల్ని పెంచేస్తున్నారు. దీంతో.. ప్రాణవాయువు కొరత కారణంగా పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇదంతా ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది. ఆక్సిజన్ కొరతపై జగన్ సర్కారు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. కరోనా వైద్యం విషయంలో భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ విధానాల్ని దెబ్బ తీస్తున్న వైనానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత సీఎం జగన్ దేనని చెప్పక తప్పదు. ఆయన సీన్లోకి వస్తే కానీ.. వ్యవహారం సెట్ కాదన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.