చంద్రబాబు బెయిల్ : నాట్ బిఫోర్ మీ

డీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ళ్లీ నిరాశే ఎదురైంది. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో రూ.341 కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌నే అభియోగంపై ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్ర‌బాబు.. త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ.. కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం దీనిపై రాష్ట్ర హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోసారి చంద్ర‌బాబు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈ నెల 30కి వాయిదా వేసింది.

వాస్త‌వానికి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంటు కేసును కొట్టివేయాల‌ని కోరుతూ.. చంద్ర‌బాబు కోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. దీనిని కొట్ట‌వేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) శుక్ర‌వారం విచారణ జరిపింది. న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు ఈ బెయిలు పిటిషన్ వ‌చ్చింది.

దీనిని విచార‌ణ‌ను చేప‌ట్టేందుకు జ‌స్టిస్ జ్యోతిర్మ‌యి.. అంగీక‌రించ‌లేదు.నాట్ బిఫోర్ మీ అంటూ విచార‌ణ‌ను ప‌క్క‌న పెట్టారు. అంటే.. ఈ బెయిల్ పిటిష‌న్‌పై తాను విచార‌ణ చేప‌ట్ట‌లేన‌ని జ‌స్టిస్ తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ.. ఇది ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ధ‌ర్మాస‌నానికి వెళ్ల‌నుంది. అప్పుడు ఎవ‌రు విచార‌ణ చేప‌డ‌తార‌నే విష‌యంపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ బెయిల్ పిటిష‌న్‌పై 30 వ‌ర‌కు వాయిదా వేస్తూ.. జ‌స్టిస్ జ్యోతిర్మ‌యి ఆదేశాలు ఇచ్చారు.