దసరా, బతుకమ్మ పండుగలు అయిపోగానే బీఆర్ఎస్ కీలక సమావేశం జరగబోతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లోను సిట్టింగ్ ఎంఎల్ఏలు, అభ్యర్ధుల ఆధ్వర్యంలో ముఖ్యనేతలు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్, మండల, డివిజన్, గ్రామాలకు చెందిన నేతలంతా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న కేసీయార్ ఆలోచనలకు తగ్గట్లే పార్టీ అధిష్టానం అభ్యర్ధుల జాబితాను దాదాపు రెండు నెలల ముందే ప్రకటించింది. దీనివల్ల కొంత పాజిటివ్ మరికొంత మైనస్ కూడా ఉందని తర్వాత తేలింది.
ప్లస్సులను పెంచుకుంటు మైనస్సులను ఎంత వీలుంటే అంత తగ్గించుకునేందుకు అభ్యర్ధులందరు ఎలా కష్టపడాలనే విషయంలోనే ఈరోజు సమావేశంలో దిశానిర్దేశం జరగబోతోంది. నిజానికి అభ్యర్ధులను ప్రకటించిన వెంటనే చాలామంది నియోజకవర్గాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే జాతీయ రాజకీయాల్లో మొదలైన కీలకమైన మార్పుల కారణంగా కేసీయారే ప్రచారానికి బ్రేకులు వేశారు. జమిలి ఎన్నికలు, పార్లమెంటు రద్దు జరుగుతుందన్న ప్రచారం ఉత్త ప్రచారంగా మిగిలిపోయింది. దాంతో మళ్ళీ ప్రచారం మొదలుపెట్టించారు.
ఇక్కడ సమస్య ఏమైందంటే ప్రచారం చేసుకుంటున్న అభ్యర్ధులను జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పథకాలు అందలేదని, అభివృద్ధి జరగలేదని, పథకాల్లో అర్హులను పక్కనపెట్టి అనర్హులను ఎంపికచేశారనే కారణాలతో జనాలంతా అభ్యర్దులపై మండిపోతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించాలని అనుకునేంతలోపు వరుసగా బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయి. దాంతో ప్రచారానికి మళ్ళీ బ్రేకులు పడ్డాయి. ఇపుడు పండుగలు కూడా అయిపోవటంతో పాటు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అందుకనే సడెన్ గా ఈరోజు అన్నీ నియోజకవర్గాల్లోను ఒకేసారి ముఖ్యనేతలతో మీటింగులు ఏర్పాటుచేశారు.
ఈ సమావేశంలోనే ప్రచారం చేయాల్సిన విధానం, హైలైట్ చేయాల్సిన ప్రభుత్వ పథకాలు, ప్రతిపక్షాల్లోని మైనస్సులు అన్నింటిపైనా డీటైల్డుగా క్లారిటి ఇవ్వబోతున్నారు. జనాలకు వివరించాల్సిన పథకాలు, సర్కార్ పై జనాల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా తగ్గించాలి ? తమకు ఓట్లేసేట్లుగా జనాలను ఎలా కన్వీన్స్ చేయాలనే విషయాలపై సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోను వార్ రూమ్ ను ఏర్పాటుచేశారు. ప్రచారానికి సోషల్ మీడియాను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకునేట్లుగా ఇప్పటికే మంత్రి కేటీయార్ అవసరమైన ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఏ విధంగా చూసినా ఈరోజు సమావేశం కీలకమనే చెప్పాలి.