ఔను! 40 కాదు.. 60 సీట్లు కావాలి! ఇదీ.. ఇప్పుడు జనసేన లెక్క. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని బహిరంగంగానే ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దీనిపై తన పార్టీ నాయకులను ఒప్పించేందుకు ఒకింత శ్రమపడుతున్నారు. ఒంటరిగానే పోటీ ఉంటుందని, పవనే సీఎం అవుతారని, ఆయనను ముఖ్యమంత్రి చేయాలని భావించిన పార్టీ కేడర్‌కు పొత్తులు పెద్దగా నచ్చలేదు.
2019 ఎన్నికల్లో ఓటమి నుంచి సెంటిమెంటును పిండుకుని.. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో విజయ తీరాలకు చేరాలనే కీలకమైన కొన్ని సామాజిక వర్గాల నాయకుల అభిప్రాయం. కానీ, పవన్ ఎవరితో చర్చించారో… ఏం చేశారో తెలియదు కానీ.. పొత్తులపై ఉత్సాహంగా ప్రకటన అయితే చేశారు. కానీ, ఆ తర్వాతే. అసలు విషయం ఆయనకు తెలిసింది. పొత్తుల ప్రకటనకు ముందు పార్టీ కార్యకర్తలు అంతో ఇంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ, పొత్తులు ప్రకటించాక మౌనం పాటించారు.
ఈ విషయంపై నివేదికలు అందుకున్న పవన్.. ముందుగానే మేల్కొనడం గమనార్హం. వెంటనే ఆయన మంగళగిరిలో కీలక నాయకులతో సమావేశం నిర్వహించి.. పొత్తుల విషయాన్ని వారితో చర్చించారు. ఎందుకు పొత్తులకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పారు. మొత్తానికి వారిని ఒప్పించారు. తలుపులు మూసేసి నిర్వహించిన ఈ సమావేశంలో పొత్తుల విషయాన్ని ఒప్పించినా.. సీట్ల విషయానికి వచ్చేస రికి మాత్రం నాయకుల అభిప్రాయాలకు పవన్ తలూపాల్సి వచ్చినట్టు తెలిసింది.
ఇప్పటి వరకు 25 నుంచి 40 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం ఉంది. ఆమేరకే టీడీపీ సీట్లు కేటాయిస్తుందని టీడీపీ నాయకులు కూడా చూచాయగా చెబుతూ వచ్చారు. దీనిపై జనసేన నాయకులు నిర్మొహమాటంగానే ప్రశ్నించినట్టు సమాచారం. 25 కాదు.. 40 కాదు.. 60 సీట్లు కేటాయించాల్సిందే.. మనం కూడా పట్టుబట్టాల్సిందే అని వారు పవన్ ముందు వారు తెగేసి చెప్పినట్టు ప్రచారంలో ఉంది. ఇక, పొత్తులపై అతికష్టం మీద కేడర్‌ను ఒప్పించిన పవన్.. ఈ విషయంలో పంతం పడితే కష్టమేనని భావించి.. అలాగే చేద్దాం! అని తేల్చి చెప్పారు.
ఇదిలావుంటే, దసరా రోజు టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం రాజమండ్రిలో జరగనుంది. ఈ సమావేశం లో టికెట్ల విషయాన్ని ప్రస్తావించి.. ఖరారు చేసుకోవాలని.. జనసేన నాయకులు చెబుతున్నారు. సీమలో 25, ఉత్తరాంధ్ర నుంచి కోస్తా వరకు 35 స్థానాలను తమకు కేటాయించేలా.. టీడీపీపై ఒత్తిడి తేవాలనే భావనలో ఉన్నారు. దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తానికి జనసేనలో ఇప్పటికైతే.. పొత్తులపై అసంతృప్తి తగ్గింది. మరి సీట్లపై ఎలాంటి నిర్ణయం ఉంటుందో . తర్వాత పరిణామాలు ఎలా మారతాయో తేలాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates