తెలంగాణ బీజేపీలోని అసంత్రుప్త వర్గాన్ని శాంతింపజేసేందుకు హైకమాండ్ రంగంలోకి దిగిందా? ఈ నాయకులకు టికెట్లతో పాటు ప్రాధాన్యతనిస్తామని చెప్పి బుజ్జగిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించబోయే అభ్యర్థుల తొలి జాబితాలో విజయశాంతితో పాటు కొండా విశ్వేశ్వర రెడ్డి పేరు ఉందనే ప్రచారమే అందుకు నిదర్శనమని చెప్పాలి. విజయశాంతికి మెదక్, విశ్వేశ్వర రెడ్డికి తాండూర్ టికెట్ ను బీజేపీ కేటాయించిందని తెలిసింది.
తెలంగాణ ఎన్నికల రేసులో ఇప్పటికే బీజేపీ వెనుకబడింది. సరైన సమయం చూసి వ్యూహాలు అమలు చేయాలని అధిష్ఠానం సూచిస్తోంది. కానీ రాష్ట్రంలో పార్టీ వెనుకబడుతోందని ఇక్కడి నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న అధిష్ఠానం 65 మందితో తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైందని సమాచారం. ఇటీవల పార్టీపై అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల్లో కొందరికి ఇందులో చోటు కల్పించారని తెలిసింది.
బీజేపీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని సీనియర్ నాయకురాలైన విజయశాంతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండటంతో విజయశాంతి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా, కాంగ్రెస్ ను పొగిడేలా ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు విజయశాంతి, విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, వివేక్ తదితరులు రహస్య సమావేశం పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. మోదీ సభల్లోనూ వీళ్లు కనిపించలేదు. దీంతో పార్టీ మారతారేమోననే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు తొలి జాబితాలోనే విజయశాంతి, విశ్వేశ్వర రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి (మునుగోడు)కి టికెట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరి టికెట్ దక్కిన తర్వాత విజయం కోసం వీళ్లు కష్టపడతారా? లేదా పార్టీకే దెబ్బ కొడతారా? అన్నది చూడాలి.