తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో విజయభేరి బస్సు యాత్ర, బైకు యాత్రలు చేపట్టింది. తాజాగా భూపాలపల్లిలో చేపట్టిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండ సురేఖ తృటి భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆమె నడుపుతున్న బైక్‌ను సురేఖ బ్యాలెన్స్ చేయలేకపోయారు. దీంతో నాలుగు అడుగుల దూరం వెళ్లిన తర్వాత.. బండి అదుపు తప్పింది. అయితే.. ఇంతలోనే బైక్ వేగాన్ని సురేఖ ఖంగారులో పెంచేశారు. దీంతో ఆ బైకు దూసుకుపోయింది. ఈ పరిణామంతో కొండా సురేఖ రోడ్డుపై పడిపోయి.. కొంత దూరం వరకు బైకుతో పాటే దూసుకుపోయారు. ఈ ప్రమాదంలో సురేఖ ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే, వెంటనే స్పందించిన కార్యకర్తలు.. బైకును అదుపులోకి తెచ్చారు. సురేఖను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా పరిశీలించిన పలువురు.. కొండా సురేఖ పెద్ద ప్రమాదం నుంచే బయట పడ్డారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ముఖాయిన గాయాలకు కట్టు కట్టామని.. వైద్య సిబ్బంది తెలిపినట్టు ఆమె అనుచరులు చెప్పారు. ఇదిలావుంటే.. బైక్ యాత్ర మాత్రం యథావిధిగా ముందుకు సాగిపోయింది.