జనసేన స్పీడ్ ఎంత?

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన కార్యక్రమాల అమలుకు తొందరలోనే జాయింట్ యాక్షన్ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యింది. టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొందరలోనే జనసేన నేతలతో ఒక సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రెండు పార్టీల నేతల సమావేశంలోనే జాయింట్ యాక్షన్ కార్యక్రమాలకు ప్లాన్ రెడీ చేయాలని కూడా డిసైడ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇందుకోసం టీడీపీలో 14 మంది నేతలతో ఒక కమిటీ ఫాం అయ్యింది. అయితే జనసేనలో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలీదు. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ కన్వీనర్ గా ఉంటారని చెప్పారంతే. అధినేత చేసిన ఆ ప్రకటన తప్ప పార్టీలో జరిగిన డెవలప్మెంట్లు ఏవీ జనాలకు తెలీదు. ఇదే సమయంలో టీడీపీలో మాత్రం పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయమైంది.

ఆ కమిటీయే మొదటి సమావేశాన్ని నిర్వహించింది. మరిలాంటి కమిటీయే జనసేనలో కూడా ఏర్పాటవుతుందో లేదో తెలీదు. లేకపోతే జనసేన తరపున నాదెండ్ల ఒక్కళ్ళే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటి నేతలతో భేటీ అవుతారేమో చూడాలి. ఈనెల 29వ తేదీ నుండి లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ మొదలవ్వబోతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు ను సీఐడీ అధికారులు 10వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుండి లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అప్పుడిచ్చిన బ్రేక్ నుండే మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఈలోగానే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళనలపై రెండుపార్టీల్లో ఒక నిర్ణయం జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే ఒకవైపు లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టడం, మరోవైపు రెండుపార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలుపెట్టడం ఏకకాలంలో జరగాలని సీనియర్లు అనుకుంటున్నారు. అయితే ఇంత తొందర సమయంలో అది సాధ్యమేనా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ముందు రెండుపార్టీల నేతల మధ్య ఒక్క సమావేశం కూడా జరగకుండానే జాయింట్ యాక్షన్ ఎలా సాధ్యమన్నది అసలు పాయింట్.