షర్మిల కథ కంచికేనా?

ఏపీలో అన్న కోసం ఆమె పోరాడారు. అన్న అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ అన్న పట్టించుకోకపోవడంతో తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టారని చెబుతారు. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించారు. కట్ చేస్తే.. ఇటు సొంత పార్టీని నిలబెట్టుకోలేక, అటు కాంగ్రెస్ లో విలీనం కోసం ఎదురు చూడడం తప్ప ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారని అంటున్నారు. ఆమెనే.. వైఎస్ షర్మిల. కాంగ్రెస్ లో తన వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం కోసం కళ్లు కాయలు కాచేలా షర్మిల ఎదురు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం షర్మిల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందనే చెప్పాలి. సొంత పార్టీని బలపరుచుకునే అవకాశం లేదు. అటు కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియం సాగడం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల కథ కంచికేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం కోసం బెంగళూరు వెళ్లి మరీ డీకే శివకుమార్ తో షర్మిల మంతనాలు జరిపారు. అనంతరం రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్థానంతోనూ చర్చలు జరిపారు. పాలేరు టికెట్ సహా కొన్ని డిమాండ్లను ఆమె కాంగ్రెస్ ముందు పెట్టినట్లు తెలిసింది.

కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవైపు ఆ పార్టీలోకి నాయకులు చేరికలు జోరుగా సాగుతున్నాయి. కానీ షర్మిల పార్టీ విలీనంపై మాత్రం అడుగు పడటం లేదు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశం ఉండటంతో ఏదో ఒకటి తేల్చాలని కాంగ్రెస్ ను షర్మిల కోరుతుందని తెలిసింది. మరోవైపు పాలేరులో షర్మిల సొంతంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ తెలంగాణ నాయకులేమో షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో బలపడుతున్న కాంగ్రెస్ కు షర్మిల భారం అవుతారని ఇక్కడి నాయకులు అంటున్నారు. సానుకూల పరిస్థితులు మెరుగు పడుతున్న సమయంలో షర్మిలను చేర్చుకోని బీఆర్ఎస్కు ఆయుధమిచ్చి లేనిపోని తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకని రేవంత్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు. షర్మిలను చేర్చుకున్నా ఏపీకే పరిమితం చేయాలని సూచిస్తున్నారు. మరి షర్మిల రాజకీయ భవిష్యత్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.