టీడీపీ పగ్గాలు చేపట్టి మీసం తిప్పు బాలకృష్ణ: అంబటి

అసెంబ్లీలో రెండో రోజు కూడా టీడీపీ,వైసీపీ సభ్యుల మధ్య రసాభాస కొనసాగుతోంది. సభలో చంద్రబాబు బల్లపైకి ఎక్కిన బాలకృష్ణ విజిల్ వేస్తూ తన నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మరోసారి బాలకృష్ణతోపాటు టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలక్యపై అంబటి షాకింగ్ కామెంట్లు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పితే లాభం లేదని, పార్టీలో తిప్పాలని అన్నారు. మీ తండ్రికి మీ బావ వెన్నుపోటు పొడిచిన ఘటనను గుర్తుకు తెచ్చుకొని మీసం తిప్పాలని విమర్శించారు.

జన్మనిచ్చిన తండ్రి క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆయనకు అండగా లేరనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉందని, ఆ అపవాదును తొలగించుకునేందుకు ఇదే సరైన సమయం అని అంబటి అన్నారు. మీ బావ జైల్లో ఉన్నారని, మీ అల్లుడు ఢిల్లీలో ఉన్నారని, పార్టీ పగ్గాలు చేపట్టాలని హితవు పలికారు. అలా చేసి నందమూరి వంశ పౌరుషాన్ని నిరూపించుకోవాలని, టీడీపీని బతికించుకోవాలని సూచించారు. ఇది తన సలహా మాత్రమేనని, పాటించకపోతే అథఃపాతాళానికి పోతారని జోస్యం చెప్పారు.

చంద్రబాబును అరెస్ట్ అయ్యారన్న ఆవేదనతో ఏదో ఒకటి చేయాలన్న దుష్ట ఆలోచనలో టీడీపీ నేతలున్నారని అంబటి విమర్శించారు. తాను లేచి నిలబడకపోతే స్పీకర్ పై దాడి చేసేవారని ఆరోపించారు. మరోవైపు, పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లను ఈ సెషన్ మొత్తం నుంచి స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.