చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును ఈ నెల 22వ తేదీకి రిజర్వ్ చేసింది.

మరోవైపు, ఈ క్వాష్ పిటిషన్ తీర్పును బట్టి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు వ్యవహారం సర్వత్రా ఉత్కంఠ రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబు తరఫున లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఏపీ సిఐడి తరఫున వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చంద్రబాబు లాయర్లు యోచిస్తున్నారని తెలుస్తుంది.

ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబును ఏపీ సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయిగా ఉండడంతో ఆయననుః విచారణ జరపాలని కోరారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 23న జరగనుంది.