బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్..టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రసాభాస జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి సభ్యులు వాయిదా తీర్మానాన్ని కోరగా దానిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో, ఇరు పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టడం, ఆయన మైక్ లాగేందుకు ప్రయత్నించడం, కాగితాలు చించి వేయడం వంటి చర్యలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను ఈ రోజు సభ నుంచి స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లను ఈ మొత్తం సమావేశాల సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా సస్పెండ్ చేశారు.

ఇక, మంత్రి అంబటి పై స్పీకర్ పోడియం దగ్గర మీసం మేలుస్తూ తొడగొట్టిన నందమూరి బాలకృష్ణ పై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బాలకృష్ణ తొలి తప్పిదంగా పరిగణించి వదిలేస్తున్నానని, ఇకపై మీసాలు మెలేయడం వంటి వికృత చేష్టలు చేయకూడదని స్పీకర్ హెచ్చరించారు. సభలో హుందాగా నడుచుకోవాలని, సభా సంప్రదాయాలను కాపాడాలని బాలకృష్ణకు హితవు పలికారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై తాము అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి టిడిపి సభ్యులు సిద్ధమా అంటూ మంత్రి బుగ్గన సవాల్ చేశారు.

మరోవైపు, సభ 10 నిమిషాలపాటు వాయిదాపడిన సందర్భంగా లాబీల్లో మాజీ మంత్రి పేర్ని నాని, టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రతిపక్షం హింస కోరుకుంటోందని నాని అన్నారు. అంతేకాదు మనసు చంపుకుని బుచ్చయ్య చౌదరి రాజకీయం కోసం పనిచేస్తున్నారని అన్నారు. అయితే, తాను రాజ్యాంగం కోసం పనిచేస్తున్నానని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇక, వైసీపీ సభ్యులు తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. తాము వాళ్ళ ట్రాప్ లో పడలేదని, సభలో హక్కుల కోసం పోరాడుతామని అన్నారు. కోటంరెడ్డిని టార్గెట్ చేసి వైసిపి సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.