సీఎం జ‌గ‌న్ దంప‌తుల‌కు హై కోర్టు నోటీసులు.. రీజ‌న్ ఇదే!

Jagan
AP CM YS Jagan Pressmeet

ఏపీ సీఎం జ‌గ‌న్‌కే కాకుండా.. ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్‌ భార‌తికి కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌క్ష‌ణ‌మే రెండు వారాల్లో త‌మ‌కు స‌మాధానం చెప్పాల‌ని.. ఢిల్లీ హైకోర్టు స‌ద‌రు నోటీసుల్లో పేర్కొంది. విష‌యంలోకి వెళ్తే.. సీఎం జ‌గ‌న్ నేతృత్వంలోని ఏపీ ప్ర‌భుత్వం వ‌లంటీర్లు, గ్రామ, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది అంద‌రూ కూడా ప్ర‌భుత్వ స‌మాచారం, ప‌థ‌కాలు, కీల‌క నిర్ణ‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ కావాల‌ని, ఆయా అంశాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని ఏడాదిన్న‌ర కింద‌ట ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఎప్ప‌టిప్పుడు వార్త‌లు ఇచ్చే సాక్షి ప‌త్రిక‌ను(ప‌రోక్షంగా చెప్పింది) కొనుగోలు చేయాల‌ని అప్ర‌క‌టిత ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల‌కు నెల‌కు రూ.200 చొప్పున‌(ప్ర‌జాధ‌నం) ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డ‌మే కాకుండా.. నిధులు కూడా మంజూరు చేసింది. అయితే.. ఈ నిర్ణ‌యాన్ని ఈనాడు దిన ప‌త్రిక ఏపీ హైకోర్టులో స‌వాల్ చేసింది. ఇలా ఒక ప‌త్రిక‌ను కొనుగోలు చేయాలంటూ.. స‌ర్కారు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డాన్ని ఈనాడు త‌ప్పుబ‌ట్టింది.

అయితే, దీనిని విచారించిన రాష్ట్ర హైకోర్టు స‌ర్కారు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించింది. దీంతో ఈనాడు యాజ‌మాన్యం.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసును రాష్ట్రంలోనే తేల్చుకోవాల‌ని తేల్చి చెప్పింది. దీంతో ఇరు వ‌ర్గాల‌కు మ‌ధ్యే మార్గంగా ఢిల్లీ హైకోర్టును ఎంపిక చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది. తాజాగా సీఎం జగన్, ఆయన సతీమణి, సాక్షి ఎండీ భారతీరెడ్డిలకు కోర్టు నుంచి నోటీసులు అందాయి.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఒక్క సాక్షిలోనే ఎలా ప్ర‌చురిస్తారో.. చెప్పాల‌ని, ఇత‌ర ప‌త్రిక‌లు కూడా ప్ర‌చురిస్తాయి క‌దా! అని నోటీసుల్లో ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ నోటీసులను స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు పంపించింది. నోటీసులు తీసుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి కోర్టు సిబ్బంది వచ్చి అందజేసినట్టు సమచారం. సాక్షి చైర్ ప‌ర్స‌న్ హోదాలో సీఎం స‌తీమ‌ణి భార‌తికి కూడా నోటీసులు అందించారు.