సమీకరణలు మారిపోతున్నాయా?

రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తు సమీకరణలు మారబోతున్నాయా ? తాజా పరిణామాలను గమనిస్తే అలాంటి అనుమానమే పెరిగిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అరెస్టయిన చంద్రబాబును ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండుకు తరలించింది. ఈ నేపధ్యంలో టీడీపీ రాష్ట్రబంద్ కు పిలుపిచ్చింది. ఈ బంద్ లో టీడీపీతో జనసేన, వామపక్షాలు చేతులు కలిపాయి. బీజేపీ మాత్రం దూరంగా ఉంది.

ఈ నేపధ్యంలో టీడీపీ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలైనట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు జగన్మోహన్ రెడ్డి, బీజేపీ అగ్రనేతల సంప్రదింపుల తర్వాతే జరిగిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే అనుమానం మామూలు జనాల్లో కూడా పెరిగిపోతోంది. చంద్రబాబును అరెస్టుచేయమని నరేంద్రమోడీ లేదా అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు. కానీ చంద్రబాబును అరెస్టుచేయాలన్న జగన్ ఆలోచనను మోడి, అమిత్ షా పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

దీంతో చంద్రబాబు అరెస్టన్నది జగన్, బీజేపీ పెద్దల వ్యూహం ప్రకారమే జరిగిందని అనుమానిస్తున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో బీజేపీని వదిలేస్తే ఎలాగుంటుందనే ఆలోచన టీడీపీలో మొదలైందట. బంద్ సందర్భంగా టీడీపీతో చేతులు కలిపిన జనసేన, వామపక్షాలతోనే ఎన్నికలను ఎదుర్కోవాలనే వాదనకు పార్టీలో మద్దతు పెరుగుతోందని సమాచారం. బీజేపీతో పొత్తు విషయంలో ఎదురుచూడటం అనవసరమైన సమయం వేస్టని అనుకుంటున్నారు. ఎలాగూ బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఓటింగ్ సున్నా అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఓటింగ్ పరంగా ఏదో కలిసివస్తుందని చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ప్రయత్నించటంలేదు. ఎన్నికల సమయంలో జగన్ను నియంత్రించటమే టార్గెట్ గా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకనే బీజేపీ పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో అది అసాధ్యమని అర్ధమైపోయినట్లుంది. అందుకనే టీడీపీతో కలిసొచ్చే పార్టీలతోనే పొత్తు పెట్టుకుని ఎన్నికలను పటిష్టంగా ఎదుర్కోవాలనే డిమాండ్ పార్టీ సీనియర్లలో పెరిగిపోతోంది. చంద్రబాబు అరెస్టన్నది బీజేపీ పెద్దలకు తెలీకుండా జరగదని అర్ధమైపోయిన తర్వాత ఇంకా కమలంపార్టీతో పొత్తుకు పర్యత్నించటంలో అర్ధంలేదని మెజారిటి తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి చివరకు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.