తెలంగాణా బీజేపీ తరపున పోటీచేయటానికి ఒక్కరోజే అంటే శనివారం నాడు 1603 దరఖాస్తులు అందాయి. 1603 దరఖాస్తులు ఒక్కరోజే అందటంతో బీజేపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. 2వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఈరోజు అంటే 10వ తేదీతో ముగుస్తోంది. 2వ తేదీనుండి శనివారం వరకు మొత్తంమీద 3300 దరఖాస్తులు అందినట్లు సమాచారం. మరి చివరిరోజు ఇంకెన్ని దరఖాస్తులు వస్తాయో చూడాలి.
ఇన్ని వేల దరఖాస్తులు అందినా పార్టీలోని ప్రముఖులు ఎవరెవరు ఎక్కడి నుండి పోటీకి ఆసక్తి చూపుతున్నారన్నది సస్పెన్సుగానే మిగిలిపోయింది. పార్టీ తెలంగాణా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి, విజయశాంతి, అర్వింద్ లాంటి చాలామంది ప్రముఖ నేతలు ఏ నియోజకవర్గాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారనే విషయంలో క్లారిటిలేదు. సీనియర్ల విషయంలోనే క్లారిటి రావటంలేదని అనుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ వారసులు కూడా దరఖాస్తులు చేసుకున్నారట.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు మిధున్ రెడ్డి షాద్ నగర్ కు, సనత్ నరగ్ నుండి పోటీకి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, శేరిలింగంపల్లి నుండి గజ్జల యోగానంద్ దరఖాస్తు చేసుకున్నారు. సనత్ నగర్, జూబ్లీహిల్స్, నారాయణపేట, ఖమ్మం నియోజకవర్గాల నుండి సినీనటి కరాటే కల్యాణి కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంమీద ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే కమలనాదులు ఊహించిన దానికన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
ఇన్నివేల దరఖాస్తులు రావటానికి కారణం ఏమిటంటే దరఖాస్తు ఫీజు లేకపోవటమే. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి ఆశక్తున్న వాళ్ళు దరఖాస్తులు చేసుకోవచ్చని నాయకత్వం ప్రకటించింది. దాని ఫలితంగానే ఇన్ని వేలమంది దరఖాస్తులు చేసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అందిన దరఖాస్తులను వడపోయాలి. అప్పుడు కానీ ఎంఎల్ఏగా పోటీచేసేంత సీన్ ఎంతమంది దరఖాస్తుదారులకు ఉందన్న విషయం బయటపడదు. వాస్తవంగా అయితే మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి పార్టీ తరపున గట్టి అభ్యర్ధులు సుమారు 40 నియోజకవర్గాల్లో కన్నా లేరు. ఈ విషయం పార్టీ నేతలతో పాటు జాతీయపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా బాగా తెలుసు.