స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు…తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించారు. న్యాయమూర్తికి సిఐడి అధికారులు అందించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ఏ-37 గా పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబును 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును సిఐడి అధికారులు కోరారు. 2021 డిసెంబర్ 9 కంటే ముందే నేరం జరిగిందని సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
ఇక, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు తప్పులతడకని ఆయన వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2021లో దాఖలైన రిమాండ్ రిపోర్టులో, ఎఫ్ ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని, ఇపుడు ఎలా వచ్చిందని ఆయన వాదిస్తున్నారని తెలుస్తోంది. సీఐడీ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అనుమతివ్వడంతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది. ఇక, ఈ కేసులో 409 సెక్షన్ ను తేవడంపై కూడా లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన సాక్ష్యాలు లేకుండా ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయకూడదని ఆయన వాదించారు.
ఇక, చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల ఫోన్ లొకేషన్స్ రికార్డు పరిశీలించాలని కోర్టును లూథ్రా కోరడం సంచలనం రేపుతోంది. మరోవైపు, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ స్కాం కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశామని, అరెస్టు చేసిన 24 గంటల్లోపే చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలుఉన్నాయా? అని న్యాయమూర్తి సీఐడీని ప్రశ్నించారు. చంద్రబాబుకు పీఏ శ్రీనివాస్ ద్వారా ముడుపుల ఆందాయని సీఐడీ వెల్లడించింది. ఈ కేసులో పారిపోయిన నిందితులను చంద్రబాబే కాపాడుతున్నాడని అనుమానం వ్యక్తం చేసింది.