మీరు తోట చంద్రశేఖర్ గుర్తున్నారా.. అదేనండి.. బీఆర్‌ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన్ను ఎందుకు గుర్తు చేస్తున్నారనే కదా మీ సందేహం. శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు అని తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సామాజిక మాధ్యమాలు వేదికగా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న తోట కూడా విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. పవన్‌కు బొకే ఇస్తున్న ఓ పాత ఫొటోను కూడా దీనికి జత చేశారు.
పార్టీలు వేరైనా పుట్టినరోజు వంటి సందర్భాల్లో శుభాకాంక్షలు చెప్పడం సహజమే. మాజీ ఐఏఎస్ అధికారి అయిన తోట చంద్రశేఖర్ గతంలో జనసేన పార్టీలో పని చేశారు. ఆ పార్టీ తరఫున 2019లో వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవి చూశారు. అంతకు ముందు 2014 వైసీపీ తరఫున వైసీపీ తరఫున ఏలూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయగా చేదు అనుభవమే దక్కింది.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో ఆయన ఆ పార్టీలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. 2009లో ఆ పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నిసార్లు ఓటమిపాలైనా ఆయన రాజకీయాల్ని మాత్రం వదలలేదు. ఆయన చివరికి బీఆర్‌ఎస్ పార్టీలో చేరి ఏపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదీ ఆయన రాజకీయ ప్రస్థానం.
ఇప్పుడు ఆయన పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాశమైంది. ట్విట్టర్‌లో ఆయన విషెష్ చెబుతూ సామాజిక అంశాలపై ఆయన నిబద్ధతను కొనియాడారు. పవన్‌కు శుభాకాంక్షలు చెప్పిన క్రమంలో పలువురు తోటకు సలహాలు ఇస్తున్నారు. వెల్‌కం బ్యాక్ సర్.. అంటూ ట్విట్టర్ వేదికగా ఆహ్వానం పలుకుతున్నారు. మీలాంటి వారు పార్టీలో ఉండాలి అంటూ ఒకరు వ్యాఖ్యానించగా.. మీరు వచ్చేయండి ఈ సారి దుమ్ము దులిపేద్దాం అంటూ మరొకరు రీట్వీట్ చేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. అది కూడా ఇప్పటికే పలు పార్టీలు మారిన ఈ నేత ఎన్నికల సమయానికి తిరిగి ఎక్కడికి చేరతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates