బీజేపీ కూడా దరఖాస్తులు తీసుకుంటోందా?

తెలంగాణా బీజేపీ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీనే ఫాలో అవుతోంది. టికెట్ల కోసం బాగా పోటీ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టింది. కాంగ్రెస్ లో దరఖాస్తులను తీసుకోవటం ఇదే మొదటిసారి కాదు . చాలాకాలంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో మొదటిమెట్టు దరఖాస్తులతోనే మొదలవుతుంది. అలాంటిది బీజేపీ కూడా ఇదే పద్దతిని మొదలుపెట్టింది. ఈనెల 4వ తేదీ నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని డిసైడ్ అయ్యింది. 10వ తేదీ దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేది.

ఇక్కడ విషయం ఏమిటంటే కాంగ్రెస్ అంటే అభ్యర్థుల వడపోతకు, పోటీని తగ్గించేందుకు దరఖాస్తుల పద్దతిని అనుసరిస్తోంది. మొన్నటి రోజున కూడా 119 నియోజకవర్గాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తే 1010 దరఖాస్తులు అందాయి. దాంతోనే నియోజకవర్గాలకు ఎంత పోటీ ఉందో అర్ధమవుతోంది. నిజానికి 119 నియోజకవర్గాల్లో పోటీకి 1010 దరఖాస్తులను వడపోయటం కష్టమనే చెప్పాలి. మరి ఇదే పరిస్ధితి బీజేపీలో కూడా ఉందా అన్నదే సందేహం.

ఎందుకంటే పార్టీ వర్గాల ప్రకారమే 119 నియోజకవర్గాల్లో సుమారు 35 నియోజకవర్గాల్లో మాత్రమే గట్టి అభ్యర్ధులున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధుల కోసం పార్టీ వెతుక్కుంటోంది. పార్టీలో అభ్యర్ధులు లేకపోవటంతోనే ఇతర పార్టీల్లోని గట్టి నేతలకు గాలమేస్తోంది. పోనీ ఇతర పార్టీల్లోని నేతలన్నా వస్తున్నారా అంటే అదీ లేదు. ఇతర పార్టీల్లో నుండి గట్టి నేతలు రాక,పార్టీలోను గట్టి నేతలు లేనపుడు ఇక దరఖాస్తులు ఎందుకు ?

119 నియోజకవర్గాకు మించి పోటీ ఉన్నపుడే కదా దరఖాస్తుల అవసరం. అసలు అభ్యర్ధులే లేని బీజేపీ కూడా దరఖాస్తులు అంటుంటే భలే కామిడీగా ఉంది. పార్టీ తరపున ఎవరో ఒకళ్ళని పోటీలోకి దింపాలంటే అభ్యర్దుల కొరత ఉండదు. కానీ పోటీ చేయబోతున్న ఇతర పార్టీల అభ్యర్ధులకు ధీటుగా గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపాలంటే మాత్రం బీజేపీ వల్ల కాదు. అయినా సరే దరఖాస్తుల డ్రామా మొదలుపెట్టబోతోంది అంటేనే ఆశ్చర్యంగా ఉంది. మరి 10వ తేదీన మొదలవ్వబోయే దరఖాస్తుల ప్రక్రియకు ఎంతమంది సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సిందే.