ఖమ్మంలో కారు బ్రేక్ డౌన్

తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నేశారు.  అందు కోసం కసరత్తుల్లో మునిగిపోయారు.  ముందుగానే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమర శంఖం పూరించారు. అభ్యర్థుల విజయం కోసం ప్రణాళికల్లో మునిగిపోయారు. అంతా బాగానే ఉంది కానీ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. ఇక ఇప్పుడు కీలక నాయకులూ పార్టీకి దూరమవడం బీఆర్ఎస్ను మరింత దెబ్బ కొడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఖమ్మంలో కారు బ్రేక్ డౌన్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ తీరుతో పడలేక, కేసీఆర్ తో కలిసి నడవలేక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో చేరిన ఆయన త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచి..  బీఆర్ఎస్ను దెబ్బతీయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక ఇప్పుడు ఖమ్మంలో మరో కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమయ్యారు. తనను కాదని పాలేరు నియోజకవర్గం టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించడంతో తుమ్మల అసమ్మతితో ఊగిపోతున్నారు. ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్న తుమ్మల కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఖమ్మంలో బీఆర్ఎస్ మరింత బలహీనపడగా.. కాంగ్రెస్ పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 అసెంబ్లీ  ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలకు గాను బీఆర్ఎస్కు దక్కింది ఒకటే. ఖమ్మం నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచిన పువ్వాడ అజయ్ మాత్రం ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్లో చెప్పుకోదగ్గ నేతగా ఉన్నారు. మరోవైపు చేరికలు, కీలక నేతలతో ఖమ్మంలో పాగా వేసేందుకు కాంగ్రెస్ చూస్తోంది. మరి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్కు ఎన్ని టికెట్లు దక్కుతాయో చూడాలి.