అసలే అంతంతమాత్రంగా ఉన్న తెలంగాణా బీజేపీలో వికాసరావు ఎంట్రీ మరింత చిచ్చు రేపుతోంది. వికాసరావు ఎవరంటే కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్రకు గవర్నర్ గా పనిచేసిన సీహెచ్ విద్యాసాగరరావు కొడుకే ఈ వికాసరావు. డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని వికాసరావు, దీప దంపతులు అనుకున్నారు. అందుకు బీజేపీనే అనువైన పార్టీగా ఎంచుకున్నారు. అందుకనే పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ వికాసరావు పార్టీలోకి ఎంట్రీ వేములవాడ నియోజకవర్గంలో చిచ్చుపెట్టినట్లు సమాచారం. ఇపుడు ఏ ప్రముఖుడు పార్టీలోకి ఎవరు చేరుతున్నా కచ్చితంగా తన పోటీపై టికెట్ హామీ తీసుకునే చేరుతున్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇపుడు వికాస్ కూడా అలాంటి హామీతోనే పార్టీలో చేరారట. ఇంతకీ విషయం ఏమిటంటే వేములవాడ నియోజకవర్గంలో పోటీకి టికెట్ పై హామీ తీసుకునే వికాస్ పార్టీలో చేరారని సమాచారం.
ఇపుడు సమస్య ఏమొచ్చిందంటే వేములవాడలో పోటీచేసేందుకు ఇప్పటికే తులఉమ, సుగుణాకరరావులు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో తుల ఉమ కీలకపాత్రమే పోషించారు. చాలాకాలం బీఆర్ఎస్ లో యాక్టివ్ గా పనిచేశారు. ఈటల రాజేందర్ మద్దతుదారైన ఉమ ఆయనతో పాటు బీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీలో చేరారు. చేరేటపుడే వేములవాడలో తనకు టికెట్ హామీ తీసుకునే పార్టీలో చేరారు. అలాగే పార్టీలో సీనియర్ నేత సుగుణాకరరావు కూడా నియోజకవర్గంలో గట్టిగా పనిచేసుకుంటున్నారు.
వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో అధ్యక్షుడితో పాటు సీనియర్లు తేల్చులేకపోతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే వికాసరావు పార్టీలో చేరారు. ద్విముఖ పోటీ కాస్త ఇపుడు త్రిముఖ పోటీగా మారింది. తన తండ్రి ద్వారా అధిష్టానం దగ్గరున్న పట్టుద్వారా వేములవాడ పోటీపై వికాసరావులో పూర్తి నమ్మకంతో ఉన్నారట. దాంతో వికాస్ బీజేపీ ఎంట్రీ పార్టీలో పెద్ద చిచ్చు పెట్టేట్లుగానే ఉంది. మరి దీన్ని కిషన్ రెడ్డితో పాటు సీనియర్ల ఎలా డీల్ చేస్తారో ఎవరికీ అర్ధంకావటంలేదు.